తెలంగాణ రాష్ట్రం ఏర్పటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి చౌరస్తాలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్నాలుగేండ్లు పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ 24గంటలూ పాటుపడుతున్నారన్నారు. ప్రస్తుతం యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో వందసీట్లు సాధించి మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అమీన్పూర్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోటని, మా బలం, బలగం కార్యకర్తలేనన్నారు. మున్సిపాలిటీలో రూ. కోట్లతో అన్ని వసతులు కల్పిస్తున్నామని, దాదాపు కోటి లీటర్ల సామర్థ్యంతో నాలుగు నీటి రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
-పటాన్చెరు/ కొల్చారం/ అమీన్పూర్, ఏప్రిల్ 9
కొల్చారం, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకనే సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నదని, ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పోతంశెట్‌పల్లి చౌరాస్తాలోని హనుమమ్మ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత రెండుసార్లు అధికారం చేపట్టి 24 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడన్నారు.
రైతులు అప్పుల ఊబీలో కూరుకుపోకూడదని పంట పెట్టుబడి కోసం రైతుబంధు, ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా ప్రవేశపెట్టి రైతుల పాలిట ఆపద్భాందవుడు అయ్యాడన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు కరెంటు, మండుటెండల్లో నిండుగా మంజీరా నది ప్రవహిస్తున్నదన్నారు. మంజీరానదిపై 14 చెక్‌డ్యాంలు నిర్మించి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా మార్చడమే కాకుండా, భూగర్భజలాలు భారీగా పెరిగాయన్నారు. ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారంగా కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతితో నందనవనాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలిచాయన్నారు.
హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కంటి వెలుగుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి మందికి కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేశారని వివరించారు.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. వృద్ధులు, వితంతువుల కోసం ఆసరా పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. తాగునీటి సమస్య తీర్చేందుకు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నర్సాపూర్-మెదక్ హైవే రోడ్డు బాగు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయన్నారు. ఇంత బిజీలో ఉండి కూడా సీఎం కార్యకర్తలతో కలిసి పోవాలని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం రైతులకు మోటర్లకు మీటర్లు పెట్టండి, రూ. 30వేల కోట్లు ఇస్తామని తెలిపినా రూ.30 లక్షల కోట్లిచ్చినా ఆ పని చేయమని సీఎం కేసీఆర్ తిరస్కరించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం అడ్డుపడినా సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేశారన్నారు.
సమావేశంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ యువత మండలాధ్యక్షుడు కోనాపూర్ సంతోశ్‌రావు, మెదక్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ సావిత్రిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, వైస్‌చైర్మన్ శేఖర్, సొసైటీ చైర్మన్లు నాగూర్ మనోహర్, మన్నె రాములు, అరిగె రమేశ్, సర్పంచ్‌లు నాగరాణి నర్సింహులు, గోదావరి, మన్నె శ్రీనివాస్, రమేశ్, రాంరెడ్డి, మానస, మాధవి, ఆత్మ కమిటీ డైరెక్టర్ అంజనేయిలు, భూపాల్‌రెడ్డి, సంతోశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ వేడుక అదుర్స్..
కొల్చారం మండలంలోని పోతంశెట్‌పల్లి చౌరస్తాలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంలో జరిగింది. కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల వ్యాప్తంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు బ్యాండు మేళాలు, మహిళల బోనాల ఊరేగింపుతో భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున కట్టిన భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో సమావేశ ప్రాంగణమంతా గులాబీమయం అయిం ది. ముందుగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పోతంశెట్‌పల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ జెండావిష్కరణ చేసి, అక్కడి నుంచి కాలినడకన ర్యాలీగా ఫంక్షన్‌హాల్ వరకు చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీ పటాకులు కాల్చి ఘనస్వాగతం పలికారు. ఇదిలాఉండగా, కిష్టాపూర్ సర్పంచ్ తిరుగనగిరి గోదావరి ఆధ్వర్యంలో మహిళలు బోనాలను తీసుకుని సభాప్రాంగణానికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఎదురుగా వెళ్లి బోనమెత్తారు. పైతర, అంసాన్పల్లి గ్రామాల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు డప్పుచప్పుళ్లతో ఆడుతూ, పాడుతూ ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ సభాప్రాంగణానికి వచ్చారు. సభావేదికపై కళాజాత నిర్వహించారు.
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలను అధ్యయనం చేసి ఎవరు ఏవిధంగా జీవిస్తారో వారికి ఏమి సౌకర్యాలు కల్పించాలో ఆలోచించి పలు పథకాలకు రూపకల్పన చేస్తున్నాడన్నారు. యావత్తు దేశం మన రాష్ట్రం వైపు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ పాలన అద్భుతమన్నారు. 70 ఏండ్ల అధికారంలో ఉన్నవారు నిర్మించని అద్భుతమైన సచివాలయ భవనాన్ని సీఎం నిర్మించాడన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించాడన్నారు. మూడోసారి జరిగే ఎన్నికల్లో 100 సీట్లు రావడం ఖాయమన్నారు.
సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచి : రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్‌రెడ్డి
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే దిక్సూచీగా తీర్చిదిద్దాడన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా రాష్ట్రంలో పరుగులు పెడుతున్నదని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు దేశంలో అధికారం వైపు సీఎం కేసీఆర్ అన్ని పార్టీలను కూడగడుతున్నారు.