ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన నిజాంపేట మండలాన్ని శనివారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే బీబీ పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని, కొత్త మండలం ఆయన చలవే అని పేర్కొన్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో ఏడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభివృద్ధిని విస్మరించారన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే
8 గురుకులాలు, మార్కెట్‌యార్డు, 15 విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు తీర్చామన్నారు. త్వరలో 50 పడకలతో మాతాశిశు దవాఖాన, టీ డయాగ్నాస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోట్ల కొద్ది కొలువులు, కోట్లాది రూపాయల నల్లధనం ఇస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేక పోయిందని ఎద్దేవా చేశారు.
– నారాయణఖేడ్, డిసెంబర్ 3
నారాయణఖేడ్, డిసెంబర్ 3: ప్రజా సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారం కల్పిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వందకు 90 శాతం పనులు చేస్తూ ప్రజలను కడుపులో పెట్టి కాపాడుతుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిజాంపేట్ కేంద్రంగా ఏర్పాటైన మండలాన్ని శనివారం మంత్రి సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్ల క్రితం మండలాలు ఏర్పాటైన సందర్భంలో నిజాంపేట్ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూసినా అప్పట్లో సాధ్యం కాలేదని, గత ప్రభుత్వాల హయాంలో మండల ఏర్పాటు విషయంలో అనేక ప్రయత్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. నిజాంపేట్ ప్రజల ఆకాంక్షను తీర్చే దిశగా సీఎం కేసీఆర్ మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ఇక ఇక్కడి ప్రజలు నారాయణఖేడ్‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రతి సమస్యను నిజాంపేట్లోనే పరిష్కరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇక్కడ ఏడు సార్లు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. ఎనిమిది గురుకుల పాఠశాలలు, మార్కెట్‌యార్డు, 15 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లిచ్చి అక్కాచెల్లెళ్ల నీటిగోస తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమన్నారు. నారాయణఖేడ్‌లో వంద పడకల దవాఖానతో పాటు కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా త్వరలో 50 పడకల మాతాశిశు దవాఖాన, టీ డయాగ్నాస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి సగౌరవంగా ఇంటి వరకు దింపుతున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గతంలో సింగూరు నీరు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించారని, టీఆర్ఎస్ ప్రభుత్వం సింగూరు నీటిని సాగుకు యోగ్యంగా చేసి గోదావరి జలాలను కాల్వల ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి తరలించి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఒకప్పుడు తాగునీటికి అరిగోస పడిన నారాయణఖేడ్ నియోజకవర్గానికి కాళేశ్వరం నీటితో కాళ్లు కడిగి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లి చూస్తే తమ రాష్ట్రంలోని పాలన ఎంత బాగుందో అర్థమవుతుందన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా వారి అవసరాలను తీరుస్తూ సుపరిపాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సొంత స్థలం ఉన్నవారు ఇండ్లు కట్టుకునేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా, నిజాంపేట్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించనున్న పీహెచ్సీ భవనానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
నిజాంపేట్ మండల ఏర్పాటులో మంత్రి హరీశ్‌రావు చూపిన చొరవ గొప్పదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టడం మూలంగానే నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. నిజాంపేట్ మండల పరిధిలోని గ్రామాలు గతంలో చాలా వెనుకబడి ఉండగా తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా, జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ జగదీశ్వర్‌చారి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీ, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ) కోట్ల కొద్ది కొలువులు, కోట్లాది రూపాయలు ఇస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కమాట నిలబెట్టుకోలేదని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆగబడుతున్నట్లు తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా ఆమేరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని తెలిపారు. ఉద్యోగాల భర్తీపై కేంద్రం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపైనా కనికరం చూపటంలేదన్నారు. బావులు, బోరుబావుల వద్ద కరెంటు మీటర్లు పెట్టాలని చెబుతుందన్నారు. అయితే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ బావులు, బోరుబావులవద్ద కరెంటు మీటర్లు బిగించేందుకు నిరాకరించినట్లు తెలిపారు. బీజేపీ తాము అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పారన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు ఎందుకు జమచేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తివేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారం, మీలో ఒకరిగా మెలిగే ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చొరవ ఫలితంగా నారాయణఖేడ్ నియోజకవర్గం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. చిన్న మండలాలతో గ్రామాలు వేగవంతంగా పురోగతి సాధిస్తాయని భావించి కేసీఆర్ ప్రభుత్వం నిజాంపేట్ మండలాన్ని ఏర్పాటు చేసిందన్నారు. హరీశ్‌రావు మంత్రిగా ఉండడం అదృష్టం మంత్రి హరీశ్‌రావు జిల్లా మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల అదృష్టమని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జిల్లాలో ఏ సమస్య వచ్చినా తీర్చడంలో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపడంతో నారాయణఖేడ్‌తో పాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షించి సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు.