నర్సాపూర్, జూలై 1: విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్‌తో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పించినా, ప్రచారం చేసినా ఇంకా అక్కడక్కడ నిషేధిత ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నది. ఈ ప్ల్లాస్టిక్ వాడకం మూలంగా మానవాళికే కాకుండా సమస్త జీవరాశికీ ఆపద పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన నరహరి ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి తనవంతుగా కృషిచేస్తున్నాడు. పదేండ్లుగా ఆయన ప్లాస్టిక్(పాలిథిన్) కవర్లను వాడడం లేదు.మటన్, చికెన్ సెంటర్లకు వెళ్లినప్పుడు స్టీల్ టిఫిన్ బాక్సులో తెచ్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని చైతన్యపురి కాలనీకి చెందిన బొజ్జ నరహరి వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. నర్సాపూర్‌లోనే ఫొటో స్టూడియో పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కొన్నేండ్ల క్రితం ఓ ఆవు పాలిథిన్ కవర్లను తినగా.. కడుపులో అవి పేరుకుపోయి ఆ ఆవు పడిన వేదనను చూసి నరహరి చలించాడు. ఆనాటి నుంచి తనవంతుగా పాలిథిన్ కవర్ల వాడకాన్ని స్వచ్ఛందంగా మానుకున్నాడు. ఇప్పటికీ నాన్‌వెజ్ మార్కెట్‌కు మటన్, చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తే తన వెంట స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాడు. కేవలం నాన్‌వెజ్ మాత్రమే కాదు…పాలు, పెరుగు, నెయ్యిని కూడా ఆయన టిఫిన్ బాక్స్‌లోనే తెచ్చుకుంటున్నాడు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లినప్పుడు తనతో పాటు జూట్ బ్యాగ్‌ను తీసుకెళ్లి అందులోనే కూరగాయలు తెచ్చుకుంటున్నాడు.
ప్ల్లాస్టిక్ను నిషేధిద్దాం..
ప్రతిఒక్కరూ తమవంతు బాధ్యతగా ప్ల్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉండాలి. ప్ల్లాస్టిక్(పాలిథిన్) కవర్ల వాడకంతో మానవాళి ముప్పుగా మారుతున్నది. మూగజీవాల సైతం మృత్యువాత పడుతున్నాయి. ప్రజలంతా దీనిగురించి ఆలోచించాలి. నావంతుగా పాలిథిన్ కవర్లను వాడడం మానేశా. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటామనే విషయాన్ని అందరూ గుర్తించాలి.
– నరహరి, నర్సాపూర్ (మెదక్ జిల్లా)