గుమ్మడిదల, ఫిబ్రవరి 9: డంపింగ్‌యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐదు రోజులుగా డంపింగ్‌యార్డు పనులు నిలిపివేయాలని, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన పనులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీప్రాంతంలో చేపడుతున్న డంపింగ్‌యార్డు పనులను వెంటనే నిలిపివేయాలని ఆదివారం బాధితగ్రామాల ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు ఆందోళన బాటపట్టారు. డప్పుచప్పులతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి జై జవాన్.. జైకిసాన్, సేవ్ ప్యారానగర్, పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. నల్లవల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
నర్సాపూర్ నుంచి ర్యాలీగా వచ్చిన మెడికల్ యూనియన్ సభ్యులు నల్లవల్లి దీక్షాశిబిరంలో ఉన్న ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. గుమ్మడిదలలో నూతనంగా ఏర్పడిన డంపింగ్‌యార్డు వ్యతిరేక జేఏసీ కమిటీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్‌నగర్ చెత్తను ప్యారానగర్ అటవీప్రాంతంలో వేసి పచ్చని అడవిని నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డంపింగ్‌యార్డు వల్ల రాయచెరువు కలుషితమవుతుందని, ప్రజలు అనారోగ్యంపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిష్టానికి అనుగుణంగా డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో రైతు సంఘం నాయకులు, జేఏసీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున ఎన్‌హెచ్‌పై ర్యాలీలు నిర్వహించారు. బొంతపల్లి, దోమడుగు, మంభాపూర్, అనంతారం, కొత్తపల్లి, కానుకుంట గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల్లో డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి ఆందోళన చేపట్టారు. డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దోమడుగులో మంగయ్య, రాజశేఖర్, మంభాపూర్లో కంజర్ల శ్రీనివాస్, కొత్తపల్లిలో ప్రభాకర్‌రెడ్డి, సత్తయ్య, రామకృష్ణ, నల్లవల్లిలో ఫయాజ్షరీప్, కుమ్మరి ఆంజనేయులు, శేఖర్,రామప్ప, శ్రీనివాస్ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
డంపింగ్‌యార్డు పనులను వెంటనే నిలిపివేయాలని మండల కేంద్రంలో జేఏసీ కమిటీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు అమ్మగారి సదానందరెడ్డి, రైతులు పోచుగారి మోహన్‌రెడ్డి,మద్దుల బాల్‌రెడ్డి, జాతీయ రైతు సంఘం నాయకుడు మందబల రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, బీజేపీ నాయకుడు రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంయుక్తంగా ఎన్‌హెచ్‌పై ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తున్న బాధిత గ్రామాల్లో పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. మండలంలోని అన్ని గ్రామాల్లో పోలీసులు టెంట్లు వేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆందోళనలు చేస్తున్న నిరసనకారుల చుట్టూ పోలీసులు వలయంగా మారుతున్నారు. ఎలాంటి చెదురుమదురు ఘటనలు జరిగినా వెంటనే అదుపుచేయటానికి సిద్ధంగా ఉంటున్నారు.
ప్యారానగర్ అటవీప్రాంతంలో చేట్టిన డంపింగ్‌యార్డును ప్రభుత్వం ఉపసంహరించేదాకా పోరాడుతామని జేఏసీ కమిటీ చైర్మన్ చిమ్ముల జైపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో అన్ని పార్టీల నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేసే వరకు జేఏసీ ఉద్యమమే ఊపిరిగా పోరాడుతుందని తీర్మానం చేశారు. సోమవారం ఉదయం పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుకు హెచ్చరించారు. సోమవారం నిర్వహించే ఆందోళనకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
డంపింగ్‌యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపి వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌యార్డును ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గ్రీన్‌ట్రిబ్యునల్‌కు మూడు వేల ఉత్తరాలు రాయనున్నట్లు బాధిత గ్రామాల ప్రజలు తెలిపారు. ఉత్తరాల రూపంలో నిరసన తెలుపుతామన్నారు.
డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజయ్య తెలిపారు. వారం రోజుల నుంచి బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తుంటే కలెక్టర్, జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రజాప్రభుత్వంలో పోరాటాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పీసీబీ, అటవీ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ చెక్‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.