గుమ్మడిదల,మే11: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర్లలో అసైన్డ్ భూమి 400 ఎకరాలకు పైగా ఉంది. ఈ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి ఇటీవల ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న అన్నారంలోని 261/1 సర్వేనంబర్ నుంచి 261/1/68 సర్వే నంబర్లోని 66 ఎకరాల భూములను టీజీఐఐసీకి అప్పగించేందుకు గెజిట్ను విడుదల చేసింది. హత్నూర మండలంలోని 380 సర్వే నంబర్లోని 13.22 ఎకరాల భూములు టీజీఐఐసీకి అప్పగించేందుకు గెజిట్ను విడుదల చేసి పారిశ్రామికీరణ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.
దీనిపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘పేదల భూములపై.. సర్కారు కన్ను..!’ కథనానికి స్థానిక రైతులు, నల్లవల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంలో కదలిక తెచ్చింది. సోమవారం నల్లవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పాలకవర్గం, రైతులు సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితులో ఈ భూములు ఇవ్వమని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకవాక్య తీర్మానం చేసింది. మాకు తెలియకుండానే, ప్రజాభిప్రాయం సేకరించకుండా రాష్ట్ర సర్కారు గెజిట్ను ప్రకటించడం సరికాదని..2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ (గెజిట్/సెక్షన్11) జారీ చేయడానికి ముందే గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వడం, సంప్రదించడం చట్టపరంగా తప్పనిసరి అని ఈ సందర్భంగా నల్లవల్లి గ్రామ సర్పంచ్ కోరివి రాణి సురేశ్ అన్నారు.
ఆమె అధ్యక్షతన అత్యవసరంగా గ్రామసభ నిర్వహించారు. 142, 160 సర్వే నంబర్ అసైన్డ్ భూములో 337.37 ఎకరాల్లో దళితులు, కుర్మ కులస్తులు అధికంగా ఉన్నారని, వీరు తాతముత్తాతల కాలం నుంచి ఈ భూములనే నమ్ముకుని పంటలు సాగుచేస్తూ బతుకుదెరువు సాగిస్తున్నారని తెలిపారు. గెజిట్ విడుధలపై న్యాయస్థానాన్ని, జిల్లా అధికారులను ఆశ్రయిస్తామని పంచాయతీ పాలకులు పేర్కొన్నారు. దీనికి కూడా రాష్ట్రసర్కారు స్పందించకుంటే పెద్ద ఎత్తున రైతు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మా గ్రామంలో 337.37 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీకి అప్పగించడానికి గెజిట్ను విడుదల చేయడం అన్యాయం. పంచాయతీకి సమాచారం ఇవ్వకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా గెజిట్ను ఎలా విడుదల చేస్తారు. ఈ భూములనే నమ్ముకుని దాదాపు 200 రైతు కుటుంబాలు పంటలు సాగుచేస్తూ బతుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గెజిట్ను ఉపసంహరించుకోవాలి.అసైన్డ్భూములు టీజీఐఐసీకి ఇవ్వమని గ్రామ పంచాయతీ నుంచి ఏకవాక్య తీర్మానం చేశాం.
-కొరివిరాణి, సర్పంచ్, నల్లవల్లి గ్రామపంచాయతీ (సంగారెడ్డి జిల్లా)
మా తాతల కాలం నుంచి ఈ అసైన్డ్ భూములనే నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్నాం. రాళ్లురప్పలుగా ఉన్న భూములను పచ్చని పంటపొలాలుగా మార్చుకున్నాం. బోర్లు వేసుకున్నాం. పంటలను పండిస్తున్నాం. వ్యవసాయ భూములను ఇండస్ట్ట్రియల్ పార్కు కోసం ఏకపక్షంగా కేటాయిస్తే మా బతుకులు ఏమి కావాలి. మా భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తాం.
-చాపల కళావతి, మహిళా రైతు, నల్లవల్లి (సంగారెడ్డి జిల్లా)