సంగారెడ్డి, జనవరి 8: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఇవ్వడంలో అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు విస్మరించారని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశాన్ని జడ్పీసీఈవో ఎల్ల య్య ప్రారంభించారు.
సమావేశానికి కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి, పట్లోళ్ల సంజీవరెడ్డి హాజరయ్యారు. ముందుగాఅభివృద్ధి, సంక్షేమంపై ప్రారంభమైన సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు. యాసంగి సాగుకు సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని సభ్యులు కలెక్టర్‌ను కోరారు.
అలాగే నల్లవాగు ప్రాజెక్టు కింద ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు తైబందు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కింద 2వేల ఎకరాలకు ఆరుతడి పంటలకు నీళ్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్‌లో ప్రజలకు సేవలు భేషుగ్గా ఉన్నాయని సభ్యులందరూ ముక్తకంఠంతో డీఎంఅండ్‌హెచ్‌వోపై ప్రశంసలు కురిపించారు. మన ఊరు-మనబడిలో పనులు పూర్తి చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలకు నిధులు చెల్లించాలని కోరా రు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా పరిషత్ సహాయ సహకారాలు అందిస్తుందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా అధికార యం త్రాంగం, జిల్లా ప్రజా ప్రతినిధులు సమన్వయంలో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. ఐదేండ్లకోసారి ప్రజలు ఏ పార్టీకి అవకాశం ఇస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, పార్టీలు వేరైనా సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో రైతులకు వెన్నెముకగా ఉన్న ట్రైయిడెంట్ చక్కెర కర్మాగారంలో 1.29 మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ చేశారని, అందులో యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన రూ. 7.35 కోట్లను వెంటనే విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కలెక్టర్ దృష్టి కి తీసుకొచ్చారు. జిల్లాలో ప్రజలకు ప్రధానంగా విద్య, వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రజాసమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. గ్రామాల పరిశుభ్రత, మంచినీటి వసతి సౌకర్యంపై మండలస్థాయిలో అధికారులతో పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా అధికారులు పాఠశాలలను దత్తత తీసుకునే విధం గా చర్యలు చేపడతామన్నారు. రంజోల్ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఘటనపై ఆర్డీవో విచారణ చేస్తున్నారని, నివేదికలు అందగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యు లు, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.