టేక్మాల్, డిసెంబర్ 18: ఈ యాసంగిలో వరి పంట సాగు చేయడానికి చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరుతూ బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యదర్శి నాయికోటి భాస్కర్ స్థానిక రైతులతో కలిసి టేక్మాల్ తహసీల్ధార్ తులసీరామ్ కు వినతి పత్రం అందజేశారు. టేక్మాల్ పరిధిలోని పెద్ద చెరువు, చిన్న చెరువు, పంతులు చెరువు, కుడి చెరువుల్లో నిండుగా నీళ్లు ఉన్నాయని, ఆయా చెరువుల పరిధి ఆయకట్టు భూములలో వరి సాగు చేసుకోవడానికి తైబంద్ విధించాలని కోరారు.
వరి పంట సాగుకు తుకాలు వేసుకునే సమయం కూడా తగ్గర పడుతోందని, ఇప్పటి వరకు తైబందు పెట్టకపోవడం వల్ల రైతులు ఆయోమయ పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. గ్రామంలో ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికిని వ్యవసాయానికి సాగు నీరు అందించకపోతే రైతులు వలస వెళ్లే దుస్థితి నెలకొంటుందని తెలిపారు.
రైతుల శ్రేయస్సు, వారి జీవనోపాధి కోసం తైబందు పెట్టి వ్యవసాయానికి సాగు నీరు అందించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి తహసీల్ధార్ ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు సంజీవులు, శివరాజ్, జోగయ్య, రాకేష్, లింగం, భూమయ్య, సాయిబాబా, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.