మెదక్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌కు బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి మంగళవారం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘనపూర్ ఆయకట్టు పరిధిలో రైతులు సాగు చేస్తున్న వరి,ఇతర పంటలు ఎండిపోతున్నాయన్నారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగూరు ప్రాజెక్టులో 7టీఎంసీల నీరు ఉన్నా ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నా నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినా సంగారెడ్డి సమీపంలో మంజీరా డ్యామ్ నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం లేదన్నారు.
హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించేందుకు మంజీరా డ్యామ్‌లో నీటిని నిల్వ చేసినట్లు అధికారులు తెలుపుతున్నారని వివరించారు. చివరి దశలో ఉన్న వరి పంటలకు నీరు లేక పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లేదని, రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సాగు నీటి కష్టాలు లేకుండా కృషి చేసిందని గుర్తుచేశారు. ఘనపూర్ ఆయకట్టులో సాగునీరు లేక కొల్చారం, పాపన్నపేట, హవేళీ ఘనపూర్, మెదక్ మండలాల్లో సాగు చేస్తున్న వరిపంట ఎండిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే శిశధర్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, కొడపాక సర్పంచ్ కాశీనాథ్‌రావు, పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.