మునిపల్లి, జనవరి 9 : ఖోఖో ఆట అంటే ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఆడతాడు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారం గ్రామానికి చెందిన ప్రదీప్. అందుకే ఆయన ఆ క్రీడాంశంలో సిసలైన ఆటగాడిగా ఆరితేరాడు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రస్థాయి జట్టుకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రదీప్ పేరు తెలియని పిజికల్ డైరైక్టర్, ఖోఖో ఆటగాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రదీప్ ఆడిన క్రీడల్లో గెలిచిన కప్పులు, సర్టిఫికెట్లును చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో తమ టీమ్ గెలవడానికి ఎంత కష్టమైనా భరించేవాడు.
క్రీడల్లో విజయం కోసం ఎంత కష్టపడుతాడో నిజ జీవితంలో అంతే కష్టాలు పడుతున్నాడు ప్రదీప్. ప్రదీప్ అమ్మ, నాన్న అతడి చిన్న వయసులోనే మృతి చెందారు. అయినా తన లక్ష్యం వైపు పయనం ఆపలేదు. చిన్నప్పటి నుంచి ఖోఖో ఆట అంటే ప్రదీప్‌కు ప్రాణం. చిన్ననాటి నుంచి తన సోదరుడు ప్రమోద్ సహకారంతో క్రీడల్లో ముందుకు సాగుతున్నాడు. సోదరుడు ప్రమోద్, బాబాయ్ కృష్ణ అండదండలతో ఇప్పటికే క్రీడల్లో అనేక విజయాల్లో ముందున్నాడు.
మండల స్థాయిలో గుర్తింపు..
ప్రదీప్ క్రీడాకారుడు మునిపల్లి మండలానికి ఓ ఆణిముత్యం అని మండల వాసులు భావిస్తారు. మండలంలోని ఏ క్రీడాకారుడు ప్రదర్శించని ఆటతీరు ప్రదర్శించడంలో ప్రదీప్ తనకు తానే సాటి. ప్రదీప్ అన్ని క్రీడల్లో ఆసక్తిగా పాల్గొంటాడు. గతంలో తమ గ్రామానికి చెందిన క్రికెట్ జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. పీఈటీ గణపతి సుశిక్షణలో ప్రదీప్ ఖోఖో క్రీడలో రాటుదేలాడు. తన లక్ష్యం నెరవేరేందుకు పద్మావతి ఖోఖో క్లబ్ పేరుతో ఆసక్తి ఉన్న క్రీడాకారులకు ప్రదీప్ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాడు.
ప్రభుత్వం సహకారం అందించాలి..
క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మాకు క్రీడారంగంలో గుర్తింపు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఇస్తే క్రీడారంగంలో నా సత్తా నిరూపించుకుంటా. పద్మావతి ఖోఖో క్లబ్ నిర్వహిస్తూ ఆసక్తి ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నా. ఖోఖోలో తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో ఆడే ఆవకాశం కోసం ఎదురుచూస్తున్నా.
– ప్రదీప్, ఖోఖో క్రీడాకారుడు, పెద్దగోపులారం