జహీరాబాద్, మే 13 : మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో విసుగు చెందిన మున్సిపల్ వాటర్ సప్లయి కార్మికులు ఆందోళన బాటపట్టారు. జహీరాబాద్ మున్సిపల్ కాంట్రాక్టు వాటర్ సప్లయి కార్మికులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ మునిసిపల్ స్టాఫ్ & కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.నర్సిములు మాట్లాడుతూ మునిసిపల్ వాటర్ సప్లయి కార్మికులకు మూడవ నెల కావస్తున్నా ఇంతవరకు జీతాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం సరైంది కాదన్నారు.
అధికారులు కార్మికులకు రెండు నెలల జీతాలు ఇవ్వక పోవడంతో ఇంటి అద్దెలు కట్టలేని స్థితిలో ఉన్నారని, నెల నెల రేషన్ షాపులో సరుకులు తెచ్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బందికి జీతం వేసి పది రోజులు కావస్తున్నా వాటర్ సప్లయి వారికి జీతం ఎందుకు వెయ్యడం లేదో అధికారులు చెప్పాలని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వాలని లేదంటే విధులు బహిష్కరిచి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి, నర్సిములు, సురేష్, గౌస్, సిద్దు, కృష్ణ, సలీమ్, బాబులు,వెంకట్, తదితరులు పాల్గొన్నారు.