రామాయంపేట, ఏప్రిల్ 28: రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు చేప పిల్లలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ముదిరాజ్ సదర్సంఘం అధ్యక్షుడు గుడాల లింగం తోపాటు పట్టణంలోని అన్ని బేడల చైర్మన్లు, ముదిరాజ్ కులస్తులు సుమారు వంద మంది వరకు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ కులస్తులకు రూ.850 కోట్లతో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు సమకూర్చామన్నారు.మత్స్యకారుల అభివృద్ధికి సహకరించింది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలు వదలక మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసిందన్నారు.
ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చుతామని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెం బ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ మాట తప్పిందని హరీశ్‌రావు మండిపడ్డారు. బీసీ సబ్‌ప్లాన్‌తో బీసీ బిడ్డలను మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ముదిరాజ్ సంఘానికి, మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు, మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పుట్టి యాదగిరి, బాదె చంద్రం, కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి రమేశ్, కొక్కు ప్రవీణ్, ఎస్కే హైమద్, హస్నొద్దీన్, దోమకొండ శ్రీనివాస్, రొయ్యల నవీన్, మహేశ్ పాల్గొన్నారు.