తూప్రాన్, జూలై 17: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను 2006లో స్థాపించారు. సుమారు 20 ఏండ్లుగా పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమై పోయాయని కొంత కాలంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెండు వారాల క్రితం పరిశ్రమ ఆవరణలో గ్రామస్తులు, ఎన్జీవోలతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
మెజార్జీ ప్రజలు పరిశ్రమ విస్తరణను వ్యతిరేకించడమే కాకుండా, ఉన్న పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రజలకు సంఘీభావం తెలిపారు. రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామస్తులతో రంగాయపల్లిలో ఈనెల 12న నిరాహార దీక్ష చేపట్టారు. 2006 నుంచి 2026 జూలై 10వ తేదీ వరకు ఎంఎస్ అగర్వాల్ కంపెనీపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఎంతమంది కార్మికులు చనిపోయారు, వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సమాచార హక్కు చట్టం-2005 కింద తూప్రాన్ సీఐ వెంకటరాజాగౌడ్‌కు బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల మధ్యలోఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రారంభమైందన్నారు.
పరిశ్రమలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, వందల మంది కార్మికులు చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలకు ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యం నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎంతమంది స్థానికులు పరిశ్రమలో పనిచేస్తున్నారు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పరిశ్రమ వల్ల ఎంతోమంది అనారోగ్యాల పాలవుతున్నారని, కంపెనీని అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. శనివారం ఫ్యాక్టరీ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్రమాలు బయటపెడుతామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.