చేగుంట, జూలై 29: పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో దుబ్బాక నియోజక వర్గంలో అనేక అభివృద్ధి జరుగుతుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన చేగుంటలో శనివారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. చేగుంట పట్టణంలోని మహంకాళమ్మ, భూలక్ష్మీ, మల్లన్న ఆలయాలను సందర్శించారు. వాసవీ కాన్యకాపరమేశ్వరి ఆలయంలో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ప్రారంభించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని బుడగజంగాల కాలనీలో పర్యటించి సీసీ రోడ్లుకు సంబందించిన నివేదికలు తయారు చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి వారికి నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఎన్జీవోస్ కాలనీలోని 14వార్డులో రూ.15లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. పద్మశాలి సంఘం భవనం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పర్యటనలో భాగంగా టైలర్ అసోసియేషన్‌తో కలిసి బట్టలు కుట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని దేశంలోని ప్రజలు గర్విహిస్తున్నారని, పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. మండలకేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్లో చేగుంట పట్టణ సమస్యలపై సమీక్షించారు.
అన్ని విధాలా దుబ్బాక అభివృద్ధికి కృషి
గత ఉప ఎన్నికలో తాను గెలిస్తే దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, దుబ్బాకకు పుష్కలంగా నిధులు తెస్తానని గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనీసం ఎక్కడైనా రూ.లక్ష పని చేశాడా, చేసిన పనుల వద్దకెళ్లి ఫొటోలు దిగి హల్చల్ చేయడం తప్ప మరేమి చేసింది లేదని ఎంపీ ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపూర్ మాజీ సొసైటీ చైర్మన్ కోమాండ్ల నారాయణరెడ్డి సతీమణి అనారోగ్యానికి గురికాగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. పోతాన్‌పల్లి సర్పంచ్ కారింగుల సంతోష భర్త సిద్దిరెడ్డి అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేసుకోగా వారిని పరామర్శించారు. ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక్ ప్రవీన్‌కుమార్, మండల మైనార్టీ అధ్యక్షుడు మమ్మద్ అలీ, పట్టణశాఖ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్, నార్సింగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైలరాంబాబు, అంచనూరి రాజేశ్, మ్యాకల జయరాములు, మ్యాకల రవి, పంచాక్షరి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నాగేశ్, బాలేశం, నాగభూషణం, రాజు, నదీం, నరోత్తంరెడ్డి, రాంరెడ్డి, దాసోజు వీరబ్రహ్మం తదితరులు ఉన్నారు.