అక్కన్నపేట, మార్చి 28: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సాగునీటి కొరత, కరెంటు కష్టాలతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావులు, బోర్లలో నీళ్లు అడుగంటాయి. చేతికందే సమయంలో కండ్ల ముందే పంటలు ఎండుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. లోవోల్టేజీ కరెంటు వస్తుండడంతో తరుచూ మోటర్లు కాలిపోతున్నారు. దీంతో రైతులు వ్యవసాయ బావులు, బోర్లు స్టార్టర్ల వద్ద 3కేవీఆర్, 5కేవీఆర్ కెపాసిటిర్లను పెట్టుకుంటున్నారు.
ఒక్క కేవీఆర్ రూ. 280 చొప్పున 3కేవీఆర్కు రూ. 840, 5కేవీఆర్కు రూ. 1400 ధర చెల్లించి స్టార్టర్ల వద్ద కెపాసిటర్లను పెట్టుకుంటున్నారు. మండలంలో లోవోల్టేజీ సమస్యలతో తరుచూ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఈ ఫసల్లో ఇప్పటికే ఒక్కో రైతుకి సంబంధించి రెండు, మూడు సార్లు మోటర్లు కాలిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. బావి మోటర్ కాలిపోతే రైతుకు సుమారు రూ, 3 వేల వరకు, బోర్ మోటర్ కాలిపోతే రూ. 5 వేల వరకు ఖర్చు అవుతున్నది. లోవోల్టేజీ కరెంట్ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ బావులు, బోర్లు వద్ద కెపాసిటర్లను పెట్టుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
వ్యవసాయానికి లోవోల్టేజీ కరెంటు వస్తోంది. కరెంటోళ్లకు చెప్పినా, వాళ్లు కూడా పైనుంచి సరిగా కరెంటు వస్తలేదు, మేము ఏం చేస్తామని అంటున్నారు. లోవోల్టేజీ కరెంటుతో మోటర్లు కాలిపోతున్నాయి. ఈ ఫసల్లో ఇప్పటికే రెండుసార్లు మోటర్ కాలిపోయింది. గతి లేక స్టార్టర్ వద్ద కెపాసిటిర్ పెట్టించిన. ఆటో, ఇటో పొలం పారుతది అనుకుంటే బావిల నీళ్లు అడుగున పడ్డయ్. ఇటు నీళ్లు బాధ, అటు కరెంటు బాధతో బతికేది ఎట్లా. బీఆర్ఎస్ పరిపాలన ఉండగ కరెంటు మంచిగ అచ్చేది. అప్పట్ల పంటలు మంచిగ పండినయి.
– జీల శ్రీనివాస్, రైతు, అక్కన్నపేట (సిద్దిపేట జిల్లా)
కొమురవెల్లి, మార్చి 28 : ఈసారి కరెంట్ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇచ్చే కరెంట్ సక్రమంగా ఇస్తే బాగుండే. పేరుకు 16 గంటలు అని అంటున్నారు. కానీ, అది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియడం లేదు. ఒక మడి పారకముందే రెండుమూడు సార్ల కరెంట్ ట్రిప్ అవుతున్నది. దీంతో గట్ల పారిన పొలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. పొలాలు ఎండిపోతున్నాయి.
– మెతుకు నర్సింహులు, రైతు, ఐనాపూర్ (సిద్దిపేట జిల్లా)