రాయపోల్, మే 17: గుంతల దారితో వాహనదారులు ప్రతిరోజు పడరాని పట్లు పడుతున్నారు. గతంలో ఈ రోడ్డు పంచాయతీరాజ్ పరిధిలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి వచ్చిం ది. హైమద్‌నగర్ నుంచి వయా రామారం, వడ్డేపల్లి, బేగంపేట మీదుగా నాచారం వరకు రోడ్డు మరమ్మతుల పనులు చేపడుతామని గతంలో అధికారులు, నాయకులు హామీలు ఇచ్చినా, నేటికి కార్యరూపం దాల్చలేదు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హమ్ పథకం ద్వారా 22 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధికి రూ.53 కోట్ల నిధులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయి. వడ్డేపల్లి,బేగంపేట నాచారం వరకు రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఉండడంతో వాహనదారులకు, ప్రయాణికులకు నరకయాతన తప్పడం లేదు.
అధ్వానంగా ఉన్న రోడ్డును డబుల్‌గా విస్తరిస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా పురోగతి లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా రాయపోల్ మండలంలో రోడ్ల దుస్థితి మారడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌల్తాబాద్ మండలం హైమద్‌నగర్ నుంచి తిర్మలాపూర్, రామారం, గుర్రాల సోఫ నుంచి వడ్డేపల్లి, బేగంపేట, నాచారం వరకు గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేయాలని గతంలో పలు గ్రామాల ప్రజలు గుర్రాల సోఫ వద్ద రోడ్డుపై ఆందోళన చేశారు. రాయపోల్ మండలంలోని రోడ్ల దుస్థితిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా బీటీ డబుల్ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదు. ఈ రోడ్డుపై మూల మలుపులు ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
దౌల్తాబాద్ మండలం హైమద్‌నగర్ నుంచి తిర్మలాపూర్ నుంచి రాయపోల్ మండలం గుర్రాల సోఫ, వడ్డేపల్లి, బేగంపేట వరకు 22 కిలోమీటర్లు రోడ్డు గతంలో పీఆర్‌శాఖ పరిధిలో ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్డును ఆర్అండ్బీ పరిధిలోకి ప్రభుత్వం తెచ్చింది. హామ్ పథకం ద్వారా రోడ్డును డబుల్‌గా విస్తరించేందుకు రూ.53 కోట్ల నిధులతో టెండర్లు పూర్తి చేశాం. కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకోగానే రోడ్డు పనులు యుద్ధ్దప్రతిపాదికన చేపడుతాం.
– వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ డీఈ, గజ్వేల్ డివిజన్ (సిద్దిపేట జిల్లా)