పటాన్చెరు, ఏప్రిల్ 15: ఓఆర్ఆర్పై ఎగ్జిట్-2 కొల్లూర్-వెలిమల సమీపంలో సర్వీస్ రోడ్డు సరిగ్గా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్-వికారాబాద్ రైలు మార్గం ఉండడంతో మధ్యలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయలేదు. వాహనదారులు సర్వీస్ రోడ్డులో వెళ్లేందుకు ఇబ్బందులు పడడంతో తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేశారు. తాత్కాలిక రోడ్డు మట్టిది కావడంతో దుమ్ము ధూళి లేస్తున్నది.
సర్వీస్ రోడ్డు చిన్నగా ఉండడంతో రెండు వైపులా భారీ వాహనాలు వచ్చినప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఓఆర్ఆర్ నిర్వాహకులు వాహనదారులు నుంచి టోల్ వసూలు చేస్తున్నా సరైన రోడ్డు నిర్మించడం లేదు. రైల్వే పట్టాలపై బ్రిడ్జి నిర్మాణం చేసి బీటీ రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. వర్షం కురిస్తే మట్టి రోడ్డుపై వాహనదారులు డ్రైవింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.