తూప్రాన్, ఏప్రిల్ 21: భర్త లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు కుమార్తెలతో సహా వాగులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్సై శివానందం వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన మమతకు మాసాయిపేటకు చెందిన వడ్డ్డేపల్లి స్వామితో తొమ్మిదేండ్ల క్రితం వివాహం జరిగింది. మమతకు పూజిత (7), తేజస్విని (5) అనే ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.
ఐదేండ్ల క్రితం వడ్డేపల్లి మమత భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మమత దంతాన్‌పల్లిలోని తన పెంపుడు తల్లి మైసమ్మ వద్ద పిల్లలతో కలిసి కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నది. సోమవారం మమత తన పిల్లలను తీసుకుని తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని హల్దీ వాగు చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు మమతను కాపాడగా, అప్పటికే పిల్లలు గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పిల్లల కోసం గాలించగా, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.