నిజాంపేట్, మే 15 : మెదక్ జిల్లా విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి చెందడంతో మనోవేదన గురైన భార్య, తన కుమారుడితో కలిసి నిజాంసాగర్ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మునిగేపల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల(32), ఎనిమిదేండ్ల కొడుకు ఇద్దరు కలిసి నిజాంసాగర్ జలాశయంలో దూకారు.
ఈమె భర్త సాయిలు ఇటీవల క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోగా భర్త చనిపోయాడని మనోవేదన చెందేదని తెలిపారు. కాగా, బుధవారం బ్యాంకు పని ఉందని ఇంటి వద్ద చెప్పి దార ప్రమీల, కుమారుడిని తీసుకొని నిజాంపేట్ బయలుదేరి అక్కడి నుంచి నేరుగా నిజాంసాగర్ జలాశయం వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మృతదేహాలు గురువారం జలాశయంలో తేలడంతో నిజాంసాగర్ పోలీసులు వెలికి తీసి పోస్టమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా హాస్పిటల్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.