మెదక్ రూరల్,అక్టోబర్ 24: మెదక్ జిల్లా శివ్యాయిపల్లిలో విషాదం అలుముకుంది. శుక్రవారం ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) సజీవ దహనమయ్యారు. శివ్వాయిపల్లికి చెందిన ఆనంద్‌గౌడ్ ఉద్యోగరీత్యా దుబాయిలో ఉం టున్నాడు. ఆయనకు మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన మాజీ సర్పంచ్ గురుమూర్తిగౌడ్ సోదరితో వివాహం జరిగింది.
వీరికి కుమారుడు శ్రీవల్లభ్గౌడ్, కుమార్తె చందన ఉన్నారు. కుమారుడు అలహాబాద్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. కుమార్తె చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఆనంద్‌గౌడ్, సుధారాణి దంపతులు దుబాయ్‌లో ఉంటూ అప్పుడప్పుడు తమ పిల్లలు వద్దకు వచ్చి వెళ్తుంటారు. పాపన్నపేటలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి సుధారాణి, భర్త పిల్లలతో కలిసి ఇటీవల వచ్చంది. రెండు రోజుల కిత్రం ఆనంద్‌గౌడ్, కుమారుడు తిరిగి వెళ్లిపోయారు. గురువారం సాయంత్రం సంధ్యారాణి తన కూతురు చందనతో కలిసి హైదరాబాద్‌లోని చింతల నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు ప్రయాణం అయ్యారు. కూతురు చందనకు తోడుగా బెంగళూరుకు వెళ్లి, అక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు సంధ్యారాణి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాద ఘటనలో తల్లీకూతురు సజీవ దహనం అయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు ఆంజాగౌడ్ , బీఆర్ఎస్ నాయకులు కిష్టయ్య బాధిత కుటుంబీకులకు మనోధైర్యాన్ని కల్పించారు.