రాయపోల్, జనవరి 16: ప్రభుత్వాలు మారి నా, ఎంతమంది అధికారులు వచ్చినా రాయపోల్ మండలంలోని వీరానగర్ బీటీ రోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బీటీ రోడ్డుగా మట్టిగా మారి కంకంర తేలడంతో ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. గజ్వేల్ పీడబ్ల్యూ రోడ్డు నుంచి వీరానగర్ వరకు సమైక్య రాష్ట్రంలో బీటీ రోడ్డు మంజూరైనా కార్యరూపం దాల్చలేదు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వీరానగర్ గ్రామానికి బీటీ రోడ్డు వేయించారు. ఆ తర్వాత ఈ రోడ్డుపై భారీ టిప్పర్లు, లారీలు నిత్యం తిరగడంతో కొన్నేండ్లలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు దెబ్బతిని ఏండ్లు గడుస్తున్నా పట్టించునే వారు కరువయ్యారు. వీరానగర్ పరిసర ప్రాంతాల్లో మల్లన్నసాగర్ జలాశయంతో పాటు రైస్ మిల్లులు ఉండడంతో అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పాటు ఈ రోడ్డు మీదుగానే వీరారెడ్డిపల్లి వీదుగా వడ్డేపల్లికి నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుండడంతో బీటీ రోడ్డు దెబ్బతిని మళ్లీ కంకర రోడ్డుగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వీరానగర్ రోడ్డును బీటీగా మారిస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు మరమ్మతులు చేయాలి..
గజ్వేల్-చేగుంట రోడ్డు నుంచి వీరానగర్ వరకు కంకర తేలిన రోడ్డును మళ్లీ బీటీగా అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది. గతంలో బీటీ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు ప్రస్తుతం గుంతలు, కంకర తేలి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డుకు మరమ్మతులు చేయాలని అనేకసార్లు నాయకులకు, అధికారులకు మొరపెట్టుకున్నా పనిచేయడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని బీటీగా మార్చి ఇబ్బందులు తొలిగించాలి.
– ఉప్పరి స్వామి, వీరానగర్