చేర్యాల, మార్చి 22: కొమురవెల్లి మల్లన్న క్షేత్రం కేసీఆర్ పాలనలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, హుండీ ఆదాయం పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో శనివారం కొమురవెల్లి మల్లన్నను ఆమె దర్శించుకున్నారు. బోనం సమర్పించి పట్నం వేసి పూజలు చేశారు. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆలయంలోని గంగరేగు చెట్టు వద్ద పట్నంవేసి బోనం సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకుముందు కొమురవెల్లి మల్లన్న స్వాగత తోరణం వద్ద బీఆర్ఎస్, బీసీ సంఘాలు, జాగృతి నాయకులు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ తల్లి, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆలయ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పెద్ద రిజర్వాయర్‌కు కొమురవెల్లి మల్లన్నసాగర్గా కేసీఆర్ నామకరణం చేశారని, కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఉమ్మడి ఏపీలో విస్మరించబడిందని, కేసీఆర్ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి రూ.50కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.
స్వామి వారికి మాన్యం ఉండాలని 130 ఎకరాలు కేటాయించారని, స్వర్ణకిరీటం, వెండి సింహాసనం, ఆలయంలోని ద్వారాలకు వెండి తాపడం చేయించినట్లు గుర్తుచేశారు. వీటితో పాటు రూ.50కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పట్నాల మండపం, ఢమరుకం,త్రిశూలం, బండగుట్ట పైభాగంలో 50కాటేజీల నిర్మాణంతో రూ.12 కోట్లతో క్యూకాంప్లెక్స్ నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్, బుకింగ్ కౌంటర్ నిర్మాణం, దేవాలయం వద్దకు వచ్చేందుకు రాజీవ్ రహదారి నుంచి కొమురవెల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. కొమురవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొమురవెల్లి అసెంబ్లీ నియోజకవర్గంగా అయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ జాగృతి,యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్‌కు తలొగ్గి ప్రభుత్వం వేర్వేరు అసెంబ్లీలో బీసీ బిల్లును పెట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకుని అమలు చేసేందుకు ప్రభుత్వ కార్యాచరణ రూపొదించాలని కోరారు. బీసీ బిల్లులపై ఎవరైనా కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలని సూచించారు.
తెలంగాణలో ప్రారంభమైన బీసీ ఉద్యమం దేశంలోని అన్ని రాష్ర్టాలకు వేగు చుక్కవలే తోవ్వ చూపుతుందని, అందుకు యునైడెట్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి ముందు వరుసలో కాగడ వలే దారి చూపుతుందని, అది విజయవంతం కావాలని కొమురవెల్లి మల్లన్నకు మళ్లీ మొక్కుకున్నట్లు కవిత తెలిపారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్లు సెవెల్లి సంపత్, గీస భిక్షపతి, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, జాగృతి రాష్ట్ర నాయకులు పబ్బొజు విజేందర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యం నర్సింహులు, ముస్త్యాల బాల్‌నర్సయ్య, మీస పార్వతి, పచ్చిమడ్ల మానస, యునైటెడ్ పూలే ఫ్రంట్, జాగృతి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.