సంగారెడ్డి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గురువారం గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 68 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఎక్కువగా టీచర్లు, పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 92.57శాతం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 73.19 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ తరలించారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉదయం సంగారెడ్డి తారా కాలేజీలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత చౌటకూరులోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, అశోక్‌కుమార్‌తో పాటు పలువురు అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి రామచంద్రాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్‌పల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మందకొడిగా ప్రారంభమై…
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊపందుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5.30 గంటల వరకు గ్రాడ్యుయేట్లు, టీచర్స్ క్యూలో ఉన్నారు. 4గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఓటు వేసే వరకు పోలింగ్ కొనసాగింది. సంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం 25652 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 2690 ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకోసం గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం 40, టీచర్ ఓటర్ల కోసం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఉదయం 10 గంటలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 8.5 శాతం, టీచర్స్ నియోజకవర్గానికి 12.94 శాతం ఓటింగ్ నమోదైంది. 12 గంటలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 24.50 శాతం, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 39.93 శాతం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 2గంటలకు టీచర్స్ నియోజకవర్గానికి 68.25 శాతం, పట్టభద్రుల నియోజకవర్గానికి 45.88 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 4గంటలకు టీచర్స్ ఎమ్మెలీ స్థానానికి 85.69, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 66.47 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 93.57 శాతం, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 73.10 శాతం పోలింగ్ నమోదైంది.
సంగారెడ్డి డివిజన్లో అత్యధికంగా ఓటు వేసిన ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంగారెడ్డి డివిజన్లో చెందిన గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జిల్లాలో 2690 ఓట్లు ఉండగా 2490 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డిలో అత్యధికంగా 1480 మంది ఓటు వేశారు. అలాగే అందోలు డివిజన్లో 170, నారాయణఖేడ్‌లో 358, జహీరాబాద్‌లో 482 మంది ఓటు వేశారు. జిల్లాలో 25,652 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, 18774 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి డివిజన్లో 11,058 మంది, అందోల్‌లో 1854, నారాయణఖేడ్‌లో 2533, జహీరాబాద్‌లో 3329 మంది గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారు.