మెదక్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, యువత కోసం సేవకుడిగా పనిచేస్తానని, నిరంతరం అందరికీ అందుబాటులో ఉంటానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 34 ఏండ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దానన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఐదువేల మంది ఉద్యోగులు ఉంటారని, 1.70 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు.
నిరుద్యోగులు, యువత కోసం పెద్దల సభలో వాణి వినిపించడానికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మెదక్ జిల్లాలో పట్టభద్రులు లక్ష వరకు ఉన్నారని, గతం లో జిల్లాలో 17వేల మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారని, గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పట్టభద్రుల పక్షాన లేకపోవడం వల్ల ఎన్రోల్ తగ్గిందని, గత సంవత్సరం ఓటు వేసిన వారు మళ్లీ ఫామ్-18 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
2021 కంటే ముందు డిగ్రీ పూర్తయిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నమో దు చేసుకోవాలన్నారు. ప్రైవేట్ విద్య సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు వచ్చే విధంగా కృషి చేస్తానని, ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యా సం స్థల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. సమావేశంలో స్నేహ విద్యాసంస్థల అధినేత సత్యనారాయణ, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.