హుస్నాబాద్, ఏప్రిల్ 11: బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని రాజ్యలక్ష్మిఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఊహించని విధంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొన్ని పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, వారికి తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఒకప్పుడు తాగునీటి కోసం రూ.22కోట్లు ఖర్చుచేసి బోర్లు వేశామని, ఇప్పుడు వాటి అవసరం లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లందుతున్నాయని చెప్పారు.
మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలోని 746 చెరువులకు మరమ్మతులు చేసుకున్నామని, దీంతో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య తీరిందన్నారు. మిడ్‌మానేరు, కాకతీయ కాల్వ, ఎల్లంపల్లి, శనిగరం ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.46వేల మందికి ఆసరా పింఛన్లు, 66,800 మందికి రైతుబంధు ఇచ్చామన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయితే హుస్నాబాద్ నియోజకవర్గంలో తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రతిపక్షాల నాయకులు రాజకీయ లబ్ధికోసం భూనిర్వాసితులను రెచ్చగొట్టి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారన్నారు. 1.06లక్షల ఎకరాలకు సాగునీరందించే రిజర్వాయర్‌ను అడ్డుకుంటున్నారంటే వారికి ఈ ప్రాంత అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు.
గిరిజన నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆర్థిక సాయం చేశామన్నారు. అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద ఎంపిక చేసేందుకు హామీ కూడా ఇచ్చామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మే నెలాఖరు వరకు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి గోదావరి నీళ్లను అందులో నింపుతామని స్పష్టం చేశారు. గౌరవెల్లి రిజర్వాయర్‌పై వస్తున్న విమర్శలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వల్లనే హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందిందని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రత్యేక దృష్టి, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కృషి, పట్టుదల వల్లనే హుస్నాబాద్ పట్టణంతో పాటు ఇతర మండలాలు అభివృద్ధి చెందాయన్నారు. హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యే సహకారంతో 95శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తయ్యాయని చెప్పారు. పట్టణానికి రెండుసార్లు జాతీయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, బోజు రమాదేవి, పెరుక భాగ్యారెడ్డి, బొజ్జ హరీశ్, గోవిందు రవి, కోఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్‌రెడ్డి, ఎండీ అయూబ్, అనిత, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు చిట్టి గోపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు బండి పుష్ప, బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు కామిరెడ్డి క్రాంతిరెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు గందె చిరంజీవి, సోషల్ మీడియా అధ్యక్షుడు భూక్యా రమేశ్‌నాయక్, నాయకులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, గాదెపాక రవీందర్, నమిలికొండ రాజయ్య, బాషవేని రాజయ్య, దేవేందర్, అరుణ్‌కుమార్, విజయభాస్కర్, పట్టణంలోని కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసీఆర్ సార్ మళ్లీ సీఎం కావాలి
కేసీఆర్ సార్ మళ్లీ సీఎం కావాలి. బీఆర్ఎస్ పార్టీకోసం మహిళలందరూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో విలు వనిచ్చింది. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారంటే అది సీఎం కేసీఆర్ సారు కృషి వల్లనే సాధ్యమైంది. ఇతర పార్టీల నాయకులు ఓర్వలేకనే విమర్శలు చేస్తుండ్రు. వారికి మహిళా కార్యకర్తలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హుస్నాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న పనులు వివరించాలి. ఐకమత్యంగా ఉండి ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే సతీశ్కుమార్సార్ హ్యాట్రిక్ కొట్టేలా పనిచేయాలి.
– పేరాల లక్ష్మి, బీఆర్ఎస్ కార్యకర్త 4వ వార్డు, హుస్నాబాద్
భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ను రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. సీఎం కేసీఆర్ సారు కూడా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే నా అనుభవంలో ఇంత అభివృద్ధిని ఎన్నడూ చూడలే. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇదంతా సీఎం సారు, మంత్రులు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సారు వల్లే సాధ్యమైంది. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే సర్కారు నుంచి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
– సొల్లు రాజమల్లు, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, ఆరెపల్లి, హుస్నాబాద్