పటాన్చెరు, జూన్ 21 : బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఈడీ దాడుల నేపథ్యంలో శుక్రవారం పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కుటుంబాన్ని హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నాయకుల బృందం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నీట్ పేపర్లు లీకైతే కేంద్ర సర్కారు చోద్యం చూస్తున్నదన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరుకైందన్నారు. నీట్ పేపర్‌ను లీక్ చేసిన గుజరాత్, బీహార్ గ్యాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. అక్కడ ఈడీ దాడులేందుకు జరగడం లేదని నిలదీశారు.
ఈడీ, ఐటీ అధికారులను కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకులను భయపెట్టేందుకు మాత్రమే వాడుతారా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగాయని స్పష్టం అవుతున్నదన్నారు. అధికార పార్టీ నేతలకు ఒక నీతి, ప్రతిపక్ష నేతలపై మరో నీతిని కేంద్రం అవలంభిస్తున్నదని విమర్శించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఎలాంటి అక్రమాస్తులు లభించలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒత్తిడికి గురిచేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ శ్రీరంగనీతులన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని, ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించారని, ఈడీకి ఎలాంటి అక్రమాస్తులు కనిపించ లేదని హరీశ్‌రావు అన్నారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా వారిని కలిసేందుకు ఈడీ బృందం నిరాకరించి కర్కషంగా వ్యవహరించిందని ఆరోపించారు.

పసిపిల్లలను అమ్మానాన్నల వద్దకు వెళ్లకుండా, అమ్మానాన్నలను కలవకుండా ఈడీ అధికారులు అడ్డుకున్నారని, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఎమ్మెల్యేను భయభ్రాంతులకు గురిచేసేందుకు చూశారన్నారు. బీఆర్ఎస్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, తప్పకుండా ధర్మం గెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పుచేసిన వారిని శిక్షిస్తే తప్పులేదని, కానీ.. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం సబబు కాదని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్‌రెడ్డితో హరీశ్‌రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడి ఈడీ దాడులపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు గూడెం మహిపాల్‌రెడ్డి వెంట ఉంటారని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేపై రాజకీయ కక్షతో ఈడీ దాడులు చేయడాన్ని ఖండించారు. హరీశ్‌రావు వెంట జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చింతాప్రభాకర్, మానిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, వైస్ చైర్మన్ ప్రభాకర్, గూడెం మధుసూదన్‌రెడ్డి, తొంట అంజయ్యయాదవ్, కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, తదితరులు ఉన్నారు.
ఎలాంటి అక్రమాలకు
తన నివాసానికి ఈడీ అధికారులు వచ్చి ప్రతి పేపర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారని, లాకర్ల నెంబర్లు, సెల్ ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాటి వివరాలు రాసుకున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల రాకపోకలను సైతం అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న చిన్నారులు ఏడుస్తున్నా అధికారులు స్పందించ లేదన్నారు. తన తమ్ముడి నివాసంలోనూ ఇలానేవ్యవహరించారన్నారు.
వారు కోరిన ప్రతి పేపర్‌ను చూపించామన్నారు. తాను కొన్న చెప్పుల రసీదు కూడా భద్రంగా ఉంచుతానని, ఏటా ఇన్‌కం ట్యాక్స్ కడతామని, చట్టప్రకారం వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. అక్రమాస్తులు సంపాదించాలనే ఆలోచనన తనకు లేదని, ప్రజలకు చిత్తశుద్ధితో ప్రజాసేవ చేస్తున్నట్లు తెలిపారు. ఈడీ బృందానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. కుటుంబ సభ్యుల పేరున ఉన్న బంగారం లెక్కలు కూడా చూశారన్నారు. వారు అడిగిన ప్రతి డాక్యుమెంట్, ఆధారం, సమాచారం ఇచ్చామన్నారు. చివరికి ఎలాంటి ఆధారం లేకుండా పోవడంతో వారు తిరుగుముఖం పట్టారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు.