సిద్దిపేట, అక్టోబర్ 27: అనేక హామీలిచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్‌తో కలిసి 127 మందికి రూ.28.65 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుబంధు ఇవ్వాలని కాంగ్రెస్ అనేకసార్లు డిమాండ్ చేసిందన్నారు. నేడు అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
ఆడపడచులకు రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పి ఒకటి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టిందన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని, తులం బంగారం దేవుడెరుగు కల్యాణలక్ష్మి కూడా ఇవ్వట్లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా, 25 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు.
పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. పేదోడికి ఇల్లు ఇవ్వకుండా.. ఉన్న ఇండ్లను కాంగ్రెస్ సర్కారు కూలగొడుతున్నదని విమర్శించారు. మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామని బాండ్ పేపర్ కూడా రాసిచ్చారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో సరార్ దవాఖానలో ఆడపిల్ల పుడితే 13వేల రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, తల్లీబిడ్డను క్షేమంగా ఇంటివద్ద దింపేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ ఇవ్వ డం లేదని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనుకరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, మో యిజ్ పాల్గొన్నారు.
రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు 600 మందికి బెనిఫిట్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన్మోహన్ ఉద్యోగ విరమణ వీడోలు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూ ఖ్ హుస్సేన్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 15 డీఏలు ఇచ్చినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక డీఏ మాత్రమే ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పరిచిందన్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడేం డ్ల తర్వాత చెల్లిస్తామనడం దుర్మార్గమైన విషయం అన్నారు. ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన వారి వేతనాల నుంచి కొంత భాగాన్ని కట్ చేసి రిటైర్మెంట్ అయినప్పుడు ఇచ్చే బెనిఫిట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం బాధాకరమైన విషయం అన్నారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వారి బాధలను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. బీర్ఎస్ హయాంలో రిటైర్మెంట్ అయిన చివర రోజే డబ్బులు ఉద్యోగి చేతికి వచ్చేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు పాల సాయిరామ్, ఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గ్యాదరి పరమేశ్వర్ కోమండ్ల విక్రం రెడ్డి, కాటం రఘురామ్, పూజల వెంకటేశ్వరరావు, భూపే శ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ చేసిన మన్మోహన్ తనకు, కేసీఆర్ కుటుంబానికి ఎంతో ఆత్మీయులు అని, ఆయన శేష జీవితం ప్రశాంతంగా సాగాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.