శివ్వంపేట, జూలై 27: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టే చేసి డిసెంబర్ 9 నుంచి ఉన్న వడ్డీ రైతులపై మోపడంతో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రైతు సాదు ఆంజనేయులు నుంచి బ్యాంకర్లు రూ.9వేల వడ్డీ కట్టించుకున్నారు. ఇదే విషయ మై శనివారం రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిలదీశారు.
డిసెంబర్ 9 వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను బురిడీ కొట్టించి ఆగస్టు వరకు పొడిగించిందన్నారు. లక్షరూపాయల రుణమాఫీ లో భాగంగా డిసెంబర్ 9 వరకు ప్రభుత్వం చెల్లించగా, డిసెంబర్ 9 నుంచి వడ్డీని రైతులే చెల్లించాలని బ్యాంకు సిబ్బంది వసూలు చేస్తున్నారని శివ్వంపేట మండల రైతు వడ్డీ కట్టిన రసీదు ను చూపారు. రుణమాఫీని ఆలస్యం చేసింది ప్రభుత్వం అయితే, అలాంటప్పుడు రైతులు వడ్డీ ఎందుకు కట్టాలని హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.