సిద్దిపేట టౌన్,ఆగస్టు 18 : విద్యపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటిన ఎస్సీ విద్యార్థులను ఆదివారం నవజీవన్ ఎంప్లాయీస్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ..నవజీవన్ ఎంప్లాయీస్ వెల్పేర్ సొసైటీ వారు విద్యార్థులకు పురస్కారాలను అందించడం అభినందనీయం అన్నారు.
మంచి కార్యక్రమాలకు తన సహాయం..ప్రోత్సహం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. పదో తరగతిలో 10/10 సాధించి విద్యార్థులు పది మందికి ఆదర్శంగా ఉండాలన్నారు.ఇదే స్ఫూర్తిని భవిష్యత్‌లోను కొనసాగించాలని కోరుకున్నారు. వెల్పేర్ సొసైటీ చేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలు బాగున్నాయని, మంచి చేసే వారికి సహకారం అందిస్తానని, తననెల వేతనం నుండి లక్ష రూపాయలు వెల్పేర్ సొసైటీకి అందిస్తానని హరీశ్‌రావు అన్నారు. ఏటా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తన సొంత డబ్బులతో ఐప్యాడ్లను అందిస్తున్నానని, ఈ ఏడాది 75మందికి అందించినట్లు తెలిపారు.
కేసీఆర్ పాలనలో విద్యకు ప్రథమ స్థానం కల్పించారన్నారు.అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలరిషిప్ ద్వారా పేద విద్యార్థుల విదేశీ చదవులకు రూ.20 లక్షల చొప్పున అందించారని గుర్తుచేశారు.అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను హరీశ్‌రావు సన్మానించారు.ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థులు నగదు పురస్కారాలు అందించారు.కార్యక్రమంలో సొసైటీ నిర్వాహకుడు కనకయ్య, బాలరాజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.