నర్సాపూర్, ఆగస్టు 22: తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాం డ్ చేశారు. నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు.
రుణమాఫీపై సీఎం ఒకమాట అంటే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు మరోమాట అంటున్నారని, వీళ్లకే రుణమాఫీ ఎంతుందో తెలియడం లేదని మం డిపడ్డారు. రుణమాఫీ కాని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిలదీస్తూ, ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. నర్సాపూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు బదులు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుకు నిరసనగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింగరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ యువజన నాయకుడు సంతోష్‌రెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు పబ్బ రమేశ్, సూరారం నర్సింహులు, షేక్ హుస్సేన్, నాగరాజుగౌడ్, సుధాకర్‌రెడ్డి, రైతు సంఘాల నాయకులు మైసయ్య, యాదాగౌడ్, రైతులు పాల్గొన్నారు.