నర్సాపూర్, మే 29: కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్లో కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు రైతులు తమ సమస్యలు విన్నవించారు.
లారీలు రాక ధాన్యం, సంచు లు లేక ధాన్యం పోవడం లేదని తెలిపారు. క్వింటాల్‌కు 6 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, లారీ డ్రైవర్‌కు సంచికి రూ.5 ఇవ్వాల్సి వస్తున్నదని, హమాలీలకు పైసలు ఇస్తున్నామని రైతులు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సాగాయని రైతులు తెలిపారు. అనంతరం డీఎస్వో, తహసీల్దార్‌తో సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సంచులు ఇవ్వకంటే ఎలా అని ప్రశ్నించారు. కాగజ్మద్దూర్, కొండాపూర్, నత్నాయిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయిందని తెలిపారు. 64 మంది రైతులు ఉన్నారని, ఒక్కో కుప్ప వద్ద 1500 బస్తాల వరకు ధాన్యం నిల్వలు ఉన్నట్లు తెలిపారు.
తిండి మాని రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తున్నదని, వర్షం పడితే రైతుల పరిస్థితి ఏమిటని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఇంత ఇబ్బందులు కలుగుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చ్రందాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రమణాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు జితేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పరమేశ్వర్‌రాజు, విఠల్గుప్త తదితరులు పాల్గొన్నారు.