కొల్చారం, జూలై 1: యాప్ ద్వారా యూరియా అందడం లేద ని, రైతుల బాధలు సర్కార్కు పట్టవా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆమె మెదక్ జిల్లా కొల్చారం మండలంలో పర్యటించారు. వసురామ్తండా గ్రామ పంచాయతీ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూరియా బుకింగ్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కంటికి కునుకు లేకుండా యూరియా కోసం రైతులు ఎదురు చూసే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో ఇచ్చిన విధంగానే షాపుల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణను కించపర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం లేనిపోని ఆడంబరాలకు పోతున్నదన్నారు.
ప్రభుత్వం మాటలు కోటలు దాటితే చేతలు గడపదాటవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు లక్ష మంది రైతులకు రూ73 వేల కోట్ల రైతు బంధు పైసలు వేశారని, ఒక్క రోజే ఖాతాల్లో డబ్బులు పడేవని గుర్తుచేశారు. రేవంత్ రైతు భరోసా రెండు ఎకరాలకే పరిమితం చేస్తూ మిగతావి ఎగ్గొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టారన్నారు.
కేసీఆర్ రైతు బాంధవుడైతే రేవంత్ రైతు ద్రోహిగా మిగిలిపోయారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, సర్పంచ్లు వినోద్నాయక్, మోహన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బాగారెడ్డి, కరెంటు రాజాగౌడ్, మల్లేశం, గోదావరి, ఎల్లేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.