నర్సాపూర్,జూలై23: హాస్టళ్లలోని విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ హాస్టళ్లలో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె వార్డెన్లకు సూచించారు. కిచెన్లో మెనూకు సంబంధించిన చాట్ ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఆదేశించారు. హాస్టళ్లలో డ్రైనేజీ, కంపౌండ్ వాల్ తదితర సమస్యలు ఉన్నాయని,వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి హాస్టల్కు మిషన్ భగీరథ కనెక్షన్ ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం కొన్ని హాస్టళ్లలో మిషన్ భగీరథ కనెక్షన్ లేదని వాటిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. టెన్త్ విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. టీడీడీవో నీలిమ, మెదక్ ఏబీసీడీవో గంగకిషన్, సంగారెడ్డి ఏబీసీడీవో అమరజ్యోతి, ఎంఈవోలు తారాసింగ్, బుచ్చానాయక్, ఏఎస్సీడీవోలు లింగేశ్వర్, పద్మజ, హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు.