నర్సాపూర్, జనవరి16: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో పాతరేయండని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ పట్టణ వాసులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కాంగ్రెస్ బాకీ కార్డులను ఓటర్లకు పంచుతూ కాంగ్రేస్ అసమర్థ పాలనను ఎండగట్టారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఆమె పర్యటించి కాంగ్రేస్ ఆడి తప్పిన హామీలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఓటు వేయాలని అభ్యర్ధించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అందుకే ప్రజలను చైతన్య పరుస్తూ బాకీ కార్డు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వాహనాలకు చలాన్లు ఉంటే అకౌంట్లోంచి నేరుగా డబ్బులను కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 12 హామీలకు సంబంధించి ప్రజలకు బాకీ పడ్డారని, ఆ డబ్బులను కూడా ప్రజల అకౌంట్లో నేరుగా వేయాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
మహాలక్ష్మీ పథకం కింద 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని అన్నారు, 12 నెలల్లో వారికి ఒక్క రూపాయి కూడా రాలేదు కాబట్టి వారికి రూ.52,500 బాకీ పడ్డారని, అదే విధంగా రూ.4 వేలు ఇస్తామన్న పెంఛన్ డబ్బులను రూ.50 వేలు బకాయిలు పడ్డారని, అలాగే దివ్యాంగులకు రూ.50వేలు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, తులం బంగారం బాకీ పడ్డారని, ఆడ పిల్లలకు స్కూటీలు బాకీ పడ్డారని, ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు బకాయిలు, విద్యా గ్యారెంటీ, ఫీజు బకాయిలు పడ్డారని తక్షణమే వాటిని చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే రైతులకు రుణమాఫీ చేస్తామని 15 శాతం పూర్తి చేయలేదని, రైతు బరోసా కూడా బకాయి పడ్డారని, మరియు బోనస్ 500 ఇస్తామని ఒక్కో రైతుకు 1 లక్ష 15 వేలు బకాయిపడ్డారని, నిరుద్యోగులకు రూ.2 లక్షల ఉద్యోగుల ఇస్తామని నేడు వారిపై లాఠీఛార్జీలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ఒక్కో విద్యార్థికి రూ.96000 ప్రభుత్వం బాకీ పడ్డదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు చెల్లిస్తామని చెప్పి ఒక్కో రైతుకు కాంగ్రెస్ సర్కార్ రూ.24 వేలు బకాయిపడ్డదని ఆమె పేర్కొన్నారు. కావున ఈ హామీలన్నిటిని తుంగలో తొక్కి అన్ని వర్గాల, రంగాల వారిని మోసం చేసిన కాంగ్రేస్ పార్టీకి బుద్ది చెప్పాలని, ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను పంచామని ఎమ్మెల్యే వెల్లడించారు. గతంలో కేసీఆర్ నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రూ.15 కోట్లు ఇచ్చారని, ఆ రూ.45 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికి పోరాడి రూ.15 కోట్లు తీసుకువచ్చామని, మిగతా బడ్జెట్ కోసం పోరాడుతామని ఎమ్మెల్యే వెల్లడించారు.
కేసీఆర్ హయాంలో 500 డబుల్ బెడ్ రూమ్లను మంజూరు చేస్తే వాటిలో 252 ఇండ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, వాటిని పేదలకు అప్పగించకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం పంపిణీ చేయకుంటే అర్హత ఉన్న వాళ్లకు తామే ఆ ఇళ్లను ఇస్తామని ఆమె హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వం బలపడే విధంగా నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యం గౌడ్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు షేక్ హుస్సెన్, ప్రసాద్, ఆంజనేయులు గౌడ్, సర్వేశ్, జగదీశ్, బాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.