సిద్దిపేట, జూన్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేయాలని, రైతులకు రైతు భరోసా, పంట రుణమాఫీ పూర్తిగా అమలు చేయడానికి రేవంత్ సర్కారు అపసోపాలు పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సిద్దిపేటలో గురువారెడ్డి విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా మభ్యపెట్టడం తగదన్నారు. జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టాలన్నారు. మోదీ సరార్ నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. విద్య, వైద్య పరంగా మన దేశం ప్రపంచంలో 126వ స్థానం ఉండడం బాధాకరమన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలను ఐదు లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కిష్టాపురం లక్ష్మణ్, బన్సీలాల్ పాల్గొన్నారు.