చేర్యాల, నవంబర్ 26: తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అని, ఆయనను ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని దానంపల్లిలో రూ.44 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, గ్రంథాలయ భవనం, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పల్లెసీమలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు. తాను ఎమ్మెల్యే విజయం సాధించినప్పటి నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తున్నానని, గ్రామాల వారీగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ఎక్కడిక్కడ పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. సమస్యలపై ప్రజలు నేరుగా తనకు ఫోన్ చేయాలని, తనను కలిసేందుకు ఎవరి రెకమెండేషన్ అవసరం లేదన్నారు. గ్రామా ల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ శ్రేణులు తప్పక తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
గ్రామ చెరువుకు కాళేశ్వరం జలాలు తీసుకువచ్చానని, దానంపల్లి నుంచి నర్మెట్ట వరకు బీటీ రోడ్డు మంజూ రు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత, పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, నాయకులు పెడుతల ఎల్లారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, వకులభరణం నర్సయ్య పంతులు, వడ్లకొండ శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గదరాజు చందు, ఎర్రబెల్లి రామ్మోహన్రావు, శ్రీనివాస్‌గౌడ్, రాచకొండ శ్రీనివాస్, మహిపాల్‌రెడ్డి, వంగ చంద్రారెడ్డి, అరిగె కనకయ్య, దాసు, శనిగరం లక్ష్మణ్, ఎర్రోల్ల యాదగిరి, అధికారులు పాల్గొన్నారు.