చేర్యాల, డిసెంబర్ 29 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద రాజకీయాలు చేయడం సరికాదని, అనాదిగా వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయవర్గాలు నడుచుకుంటే బాగు ంటుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవానికి హాజరైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటిస్తే అందరికీ బాగుంటుంది అనేది తన అభిప్రాయమని, దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదన్నారు.
మల్లన్న కల్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చేవారని, ఈసారి భక్తుల సంఖ్య తగ్గిందని, రాజకీయాలకు తావు లేకుండా పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుందన్నారు. కానీ, ఇవాళ ప్రొటోకాల్ లేకుండా తాము మాత్రమే తీసుకుపోతున్నామని ఆలయ అధికారులు తెలియజేయడంతో దానిని వివాదం చేయకుండా భక్త జనులతో సహా తామం తా గ్యాలరీలో కూర్చుని కల్యాణాన్ని వీక్షించినట్లు ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు.
వచ్చే ఏడాది మల్లన్న కల్యాణం నాటికి మౌలిక వసతులు, సౌకర్యాలు పెంచి భక్తు లు ఎక్కువగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. గతం లో మల్లన్న కల్యాణం బ్రహ్మాండంగా జరిగిందని, ఇప్పుడు ఈ పరిస్థ్ధితి ఎందుకు వచ్చిందో అధికారు లు భక్తులకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు.
కొమురవెల్లి మల్లన్న తమ కుల దైవమని, ఏటా స్వామి వారిని కుటుంబ సభ్యులతో దర్శించుకుంటానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.కల్యాణోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడా రు. పూలు, పాలు అమ్మినా, యూనివర్సిటీలు పెట్టి నా, మంత్రిని అయినా, నేడు ఎమ్మెల్యేను అయినా అంతా మల్లన్న దయతోనేనని అన్నారు. మల్లన్న ఆశీస్సులతో అన్ని విధాలుగా అభివృద్ధి చెందానని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన వయ సు 72 ఏండ్లు అని, తన పుట్టువెంట్రుకలు ఇక్కడే తీశారని వెల్లడించారు.కొమురవెల్లి మల్లన్నను ఏది కోరుకున్నా సక్సెస్ అవుతానని ఆయన తెలిపారు.