చేర్యాల, నవంబర్ 7: బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాలకు మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును ప్రారంభించేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోర్టు ప్రారంభం కావాల్సి ఉం డే, ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయింది. అనంతరం కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో కోర్టు ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. కోర్టుకు కావాల్సిన సిబ్బందిని కేటాయించకపోవడంతో ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది.
ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించారు. దీంతో చేర్యాల కోర్టుకు సిబ్బందిని కేటాయి స్తూ న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశా రు. చేర్యాల కోర్టులో 27 మంది సిబ్బంది పని చేసే విధంగా న్యాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. చేర్యాలలో కోర్టు ఏర్పాటు ప్రక్రియలో ముఖ్య భాగమైన సిబ్బంది కేటాయింపున కు కృషి చేసిన ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ నాయకులు, న్యాయవాదులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.