చేర్యాల, ఫిబ్రవరి 29: రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు, పరిపాలన చేసినప్పుడే మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి అధ్యక్షతన గురువారం 2024-25 ప్రత్యేక బడ్జెట్ సమాశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్, సిబ్బంది పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు బడ్టెట్‌పై చర్చించారు.వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు సమావేశంలో అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు పట్టణాభివృద్ధికి సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పొందిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పలువురు పన్నులు చెల్లించినప్పటికీ బకాయి ఉన్నట్లు నోటీసులు మున్సిపల్ నుంచి వస్తున్నాయనే విషయం నా దృష్టికి వచ్చిందని వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సవ్యంగా సాగేందుకు అన్నివర్గాలు సహకరించాలన్నారు. కౌన్సిలర్లు, అధికారులు, వార్డు ఇన్చార్జిలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదన్నారు.
చేర్యాల పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సర అంచనాల బడ్జెట్, 2022-23 ఆర్థిక సంవత్సరం సవరించిన ఆదాయవ్యయాల అంచనాల బడ్జెట్‌ను (రూ.15కోట్ల 79లక్షల బడ్జెట్‌కు ఆమోదం) మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, ఆడెపు నరేందర్, యాట కనకవ్వ, ఉడుముల ఇన్నమ్మ, సందుల సురేశ్, తుమ్మలపల్లి లీలా, ముస్త్యాల తార, పచ్చిమడ్ల సతీశ్, కోఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్రావు, పచ్చిమడ్ల అంజనీదేవి, జేబాబేగం, యారవ ఆరోగ్యరెడ్డి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్, మేనేజర్ ప్రభాకర్, ఏఈ శ్రీకాంత్, రాములు, పాల్గొన్నారు.