మెదక్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారు ప్రచార రంగంలోకి దిగేందుకు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి బీ ఫాం అందుకున్నారు. బీ ఫాంతోపాటు మేనిఫెస్టోతో రానున్న మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఇక ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇక నేరుగా ఓట్లు అడిగేందుకు ప్రజల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక ముఖ్య నేతలతో సమావేశమై ప్రచార విషయమై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నేతృత్వంలో అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోమవారం నుంచి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నా రు. మెదక్, రామాయంపేట మండలాల్లో ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ఒక దఫా మీటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ప్రచారం
ఆదివారం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ప్రచారం చేయనున్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగా నే ఆసరా పెన్షన్ రూ.2,016 నుంచి రూ.5,016కు పెంచనున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా కల్పించనున్నారు. అంతేకాదు తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. దివ్యాంగుల పెన్షన్ రూ. 4,016 నుంచి రూ.6,016కు పెంచనున్నారు. అలాగే రైతు బంధు పథకం ఎకరానికి రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచారు. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3వేలు అందించనున్నారు. ఇలా ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ను గెలిపించాలని పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు.
అభివృద్ధి సాధించాం
మెదక్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగని అభివృద్ధి సాధించాం. నిధుల వరద పారించాం. చేసిన పనినే ప్రజల ముందుంచుతాం. ఆదివారం బీ ఫాం తీసుకున్న తర్వాత సోమవారం నుంచి మెదక్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాం. ఇప్పటికే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాం. గ్రామ స్థాయిలోకి వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించింది. అందుకే ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. సీఎం కేసీఆర్ వ్రవేశపెట్టిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి