మెదక్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): జిల్లాల పునర్విభజనతో సుపరిపాలన అందుతున్నదని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులేసి విజయం సాధించారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరించి, సిబ్బందితో పాటు అధికారాలు, అవసరమైన నిధులు అందజేస్తూ బలోపేతం చేస్తున్నారన్నారు. ఆన్లైన్ విధానంలో ఏక పక్ష పద్ధతిలో గడువులోగా అనుమతులిస్తూ పైసా ఖర్చు లేకుండా ప్రజలకు సమర్థవంతమైన సేవలందిస్తున్నారన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ పనుల నిమిత్తం వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లినా కొన్నిసార్లు అయ్యేవి కావన్నారు. నేడు మెదక్ జిల్లాతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 6 మండలాలు, 157 పంచాయతీల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువయ్యిందన్నారు.
అన్ని కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయ భవనాలను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నామన్నారు. తద్వా రా వివిధ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఖర్చులు, సమయం ఆదా అవుతుందన్నారు. శాంతి భద్రతల రక్షణకు పోలీస్ శాఖకు ఇన్నోవా వాహనాలు, నిధుల కేటాయింపు, షీ టీమ్‌లు ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం కల్పించిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఇదే తెలంగాణా సాధించిన ప్రగతికి గీటురాయని అన్నారు. అంతకుముందు సుపరిపాలన దినోత్సవ కరపత్రాన్ని ఎమ్మెల్యేలు, ప్రజాప్రనిధులు, కలెక్టర్ ఆవిషరించారు. అనంతరం ప్రగతి నివేదికను వినిపించారు. ఆ తరువాత ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మెదక్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బొంది రవీందర్ గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, హరికృష్ణ, సిద్ధరాములు, వినోద, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే: మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ బండికి రెండు చక్రాల్లా అభివృద్ధి, సంక్షేమంతో ప్రభు త్వం దూసుకెళ్తున్నదన్నారు. నేడు ఏ రాష్ట్రానికి వెళ్లినా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి అడుగుతున్నారన్నారు. ప్రజల సౌలభ్యం కోసం పాలన వ్యవస్థను వికేంద్రీకరించి అందిస్తున్న సుపరిపాలనపై దేశం యావత్తు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నదన్నారు. మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు పూర్తి స్థాయిలో వస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక చేపట్టిన సంసరణలు, సుపరిపాలన, ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మననం చేసుకోవడానికి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
పారదర్శంగా సేవలందిస్తున్న ప్రభుత్వం: రాజర్షి షా, కలెక్టర్
అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజలకు చేరువలో పారదర్శకంగా సేవలందిస్తున్న ఉత్త మ ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్ర భుత్వం ప్రజలకు చేరువ లో సుపరిపాలన అందిస్తూ అందరి మన్ననలు పొం దుతున్నదన్నారు. ప్రతి కార్యక్రమంలో పారదర్శకత ఉండేలా ఆన్లైన్ వ్యవస్థను పటిష్టపరిచి టీఎస్ఐపాస్, టీఎస్‌బిపాస్, ధరణి, మీసేవ వంటి విధానాల తో పైసా ఖర్చు లేకుండా అనుమతులు ఇస్తున్నదన్నారు.
శాంతిభద్రతల అదుపుతో అభివృద్ధి: రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ శాంతిభద్రతలు అదుపులో ఉంటే అభివృద్ధి వికసిస్తుందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి, శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా అదనపు పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పరిధి తగ్గి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇందుకు ప్రభుత్వం వాహనాల కేటాయింపు, నిధులు మంజూరుతో సులువుగా మానిటరింగ్ చేసేందుకు, నేరాలు అరికటేందుకు వీలవుతుందని తెలిపారు.