సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. భారీ వర్షాలు కురుస్తున్నందున మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, డయేరియావంటి రోగాలు వ్యాప్తి చెందే అవకాశమున్నందున వైద్యారోగ్యశాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను అప్రమత్తం చేసింది. ఈ వ్యాధులన్నింటికీ ప్రధాన లక్షణం జ్వరం కావడంతో బాధితులను గుర్తించేందుకు మెదక్ జిల్లాలో ఈ నెల 15 వ తేదీ నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టింది. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వైద్యసిబ్బంది నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు సభ్యుల సహకారంతో మురుగు, చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచినీటి పైపుల లీకేజీలు లేకుండా, నల్లాలు, చేతి పంపుల వద్ద పరిశుభ్రత ఉండేలా చూస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నీటి నిల్వఉన్న ప్రాంతా లు, కుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడంతో పాటు ఫాగింగ్ చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షిషాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలంగా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
– మెదక్ (నమస్తే తెలంగాణ), జూలై 30
మెదక్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. ఇంటింటా జ్వర సర్వే వేగంగా సాగుతున్నది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల బెడద పెరిగింది. మలేరియా, డెంగీ, డయేరియా వంటివి వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ వ్యాధులన్నింటికీ ముఖ్య లక్షణం జ్వరం కావడంతో ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టింది. జిల్లాలో ప్రతి ఇంటికీ వెళ్తున్న వైద్య సిబ్బంది జ్వరాలతో బాధ పడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలను ఫీవర్ సర్వే యాప్‌లో నమోదు చేస్తున్నారు. జ్వరం ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇతర లక్షణాలేమిటో తెలుసుకుని, అవసరమైన వైద్య పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు బాధితులకు వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. పారిశుధ్యం మెరుగుదలకు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీజనల్ వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతున్నది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పల్లెలు, పట్టణాలు క్లీన్ అండ్ గ్రీన్‌గా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు అప్రమత్తమయ్యాయి. మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల సహకారంతో అంటువ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, రహదారులపై చెత్తాచెదారం లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నారు. మంచినీటి పైపుల లీకేజీల సమస్య లేకుండా, నల్లాలు, చేతి పంపుల వద్ద పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. హోటళ్లు, మాంసం మార్కెట్లు, దుకాణాలు, చిరు తిండి అమ్మే బండ్లపై నిఘా ఉంచారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దోమల నివారణకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఆదర్శ గ్రామాల పేరిట గ్రామ స్థాయిలో పారిశుధ్య పనులు పకాగా నిర్వహించడమే కాకుండా పచ్చదనానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. నీటి నిల్వ ఉన్న కుంటల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో, ఆయా కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెదక్ పట్టణంలో ఇండ్లు కూలిపోయిన ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. భారీ వర్షాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. నర్సాపూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో తిరుగుతున్నారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వానకాలంలో రకరకాల రోగాలు వ్యాపిస్తుంటాయి. డెంగీ, మలేరియా, విష జ్వరాలు, జలుబు, డయేరియా వంటి వ్యాధులు ప్రతి వీధిలో విజృంభిస్తుంటాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో డాక్టర్ చందునాయక్ తన సిబ్బందితో రంగంలోకి దిగారు. వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్స్, సూపర్వైజర్లను అన్ని పీహెచ్‌సీల్లోకి పంపించి సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో ఈనెల 15 నుంచి సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా వైద్యబృందాలు గ్రామాలు, పట్టణాల్లోని ఇండ్ల ను సందర్శిస్తున్నాయి. వారం రోజుల క్రితం జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదయ్యాయి.
సీజనల్ వ్యాధుల నివారణ పై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యాధికారులు, సి బ్బందిని అప్రమత్తం చేస్తూ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాం. మెదక్ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఏఎన్ఎంలు, ఆశ వర్క ర్లు ఇంటింటికీ వెళ్లి డెంగీ, మలేరియా, వివిధ జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలి. ప్రతి ఆదివారం 10 నిమిషా లు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించా లి. శుక్రవారం డ్రై డే చేపట్టాలి. నీటిని వేడి చేసిన తర్వాతే తాగాలి. – డాక్టర్ చందునాయక్,
డీఎంహెచ్‌వో, మెదక్