నర్సాపూర్, అక్టోబర్ 25: నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వాకిటి సునీతాలక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం బీఫామ్‌ను అందజేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో కలిసి ఆమె సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్‌రెడ్డికి మంచి స్థానం ఇచ్చే అవకాశమున్నది. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారని తెలిసింది. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజస్కంధాల మీద వేసుకొని సునీతాలక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారని తెలిసింది. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డి పాపులర్ లీడర్, వివాదరహితుడు, సౌమ్యుడుగా పేరుతెచ్చుకున్న మదన్‌రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవలసి ఉంటుందని, చిన్నచిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్‌రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని సీఎం కేసీఆర్ మదన్‌రెడ్డికి ధన్యవాదాలు, అభినందనలు సీఎం కేసీఆర్ తెలిపాడని సమాచారం. వీరితోపాటు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఉన్నారు.
వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సికింద్రాబాద్‌లో 05-04-1968న జన్మించారు. దివంగత శివంపేట్ మాజీ జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి ఆమె భర్త. శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని ఎస్టీ ఆంథోనీ పాఠశాలలో పదో తరగతి, వణిత మహా విద్యాలయంలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. మొదటి సారిగా తన భర్త మరణానంతరం 1999లో నర్సాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2000 నుంచి 2002 వరకు మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. 2002 నుంచి 2004 వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ కన్వీనర్‌గా విధులు చేపట్టారు. 2009లో మైనర్ ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010-2014లో కూడా స్టేట్ క్యాబ్‌నెట్ ఐకేపీ, పింఛన్, డబ్ల్యూడీ ఆండ్ సీడీ, డిసబుల్ వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014లో మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందారు. 2014లో మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 3, 2019లో టీఆర్ఎస్లో చేరారు. డిసెంబర్ 27, 2019లో సీఎం కేసీఆర్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించాగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.