దుబ్బాక, జనవరి 6: ఎద్దు ఏడ్చిన ఎవుసం..రైతు ఎడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడదన్నట్లుగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను కంటతడి పెట్టిస్తున్న రేవంత్ సర్కారుకు పుట్టగతులుండవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతుబంధువైతే ..రైతులను హరిగోస పెడుతున్న రేవంత్ సర్కారు రైతు రాబంధువుగా మారడని విమర్శించారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న రైతు భరోసా ఇచ్చేంతవరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిరసనలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతులకు రైతు భరోసా కింద రావాల్సిన డబ్బుల వివరాల ఫ్లకార్డులతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మట్లాడుతూ..రైతుల కోసం పోరాటం చేసే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని, రైతు సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడాలేని పథకాలు ప్రవేశపెట్టి, రైతు బాంధవుడిగా కేసీఆర్ రైతుల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ సీఎం గద్దెపై కూర్చుని రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూ సమైక్యాంధ్రా పాలనను మెచ్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కా రు కాలయాపన చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను రోడ్డుకిడ్చిందని మండిపడ్డారు. అప్పుడు పండించిన పంటకు మద్ధతు ధర, ఎరువులు, విత్తనాలు, రుణమాఫీ కోసం, ఇప్పుడు రైతు భరోసా కోసం రైతులు రోడ్డ్డెక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయిపడ్డ డబ్బులను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ రైతులకు రైతు భరోసా ద్వారా ఎకరానికి రూ.15 వేలు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. రైతు భరోసా అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని సూచించారు. రైతుల కోసం పోరాటం చేసేందుకు వస్తున్న తమను కాంగ్రెస్ సర్కారు పోలీసులతో హౌస్ అరెస్టు చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రస్తుత రేవంత్ సర్కారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. రైతులను మోసగించిన కాంగ్రెస్ సర్కారు మెడలు వంచే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, నారాగౌడ్, భూం రెడ్డి, శ్రీనివాస్, జీడిపల్లి రవి, బండి రాజు, కమలాకర్‌రెడ్డి, ప్రభాకర్, కృష్ణ, కిష్టారెడ్డి, విష్ణు, దేవరాజు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.