దుబ్బాక, నవంబర్ 26: దుబ్బాక వంద పడకల దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యసిబ్బందికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం దుబ్బాక వంద పడకల దవాఖానలో అభివృద్ధి కమిటీ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దవాఖానలో అందుతున్న వైద్యసేవలు, మందులు, డయాలసిస్, శానిటేషన్తో పాటు వైద్యసిబ్బంది పనితీరు, రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు.
బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్ తరహాలో సకల వసతులతో ఈ దవాఖాన నిర్మించామని, సరిపడా వైద్యసిబ్బంది ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతనాలు, ఇతరత్రా ఖర్చు నిమిత్తం ఈ దవాఖాన మీద ప్రభుత్వం ప్రతినెలా రూ. కోటి వ్యయం చేస్తున్నదని, కానీ.. సేవలు అంతంతమాత్రంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో సరిగ్గా వైద్యం అందించ లేకపోతున్నారని ప్రశ్నించారు. దవాఖానలో నెలకొన్న సమస్యలపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌తో ఫోన్లో ఎమ్మెల్యే మాట్లాడారు. డెంటల్ విభాగంలో వైద్య పరికరాలు లేకపోవడంతో దంత వైద్యులను ఇతర చోటకు పంపించాలని, వారి స్థానంలో చిన్న పిల్లల డాక్టర్లను నియమించాలని ఎమ్మెల్యే కోరారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన రూ.40 లక్షలు నిధులు దవాఖాన అభివృద్ధికి వినియోగించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశంలో సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, కౌన్సిలర్లు దేవుని లలిత, ఆస యాదగిరి, స్వామి, శ్రీనివాస్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో ఉపాధిహామీ పథకంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, ఓ రైతు వ్యవసాయ భూమిలో కూరగాయల తోటలో నీటి తొట్టి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉన్నారు. అనంతరం రాజక్కపేటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో బక్కి వెంకటయ్య, కైలాశ్, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్, భూంరెడ్డి, పండు తదితరులు పాల్గొన్నారు.