దుబ్బాక, సెప్టెంబర్ 22 : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి పాత్రుడైన తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విషయమై రాజకీయం చేయ డం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ లడ్డూ అపవిత్రత చోటు చేసుకుందని కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు , మాజీ సీఎం జగన్‌తో సహా ఆయా పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ టీటీటీ, లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తున్నారన్నారు.
లడ్డూ పవిత్రత వ్యవహారంలో ఏమైనా పొరపాటు జరిగితే ప్రభుత్వం విచారణ చేయాలని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారిపై సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. కానీ, ఇవేవి లేకుండా లడ్డూ వ్యవహారాన్ని బహిరంగం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరైం ది కాదన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి లడ్డూ పవిత్రను కాపాడాలని, భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు.