కోహీర్, ఏప్రిల్ 24: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, రాయిపల్లి, దిడిగి, కొత్తూర్(బి) గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రైతుబంధు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అడిగితే చెప్పులతో కొడ తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కుతం, పేగులు మెడలో వేసుకొంటాం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీల అమలు, మంచి పనులు చేసేందుకు అధికారంలోకి వచ్చారా.. లేకా తిట్ల కోసం వచ్చారా? అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి వాడాల్సిన భాష ఇదేనా అని నిలదీశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరైనా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గాలి అనిల్‌కుమార్‌ను గెలిపిస్తే పార్లమెంట్లో జహీరాబాద్ సమస్యలను లేవనెత్తుతారన్నారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పనుల్లో తేడాను చూసి ఓటువేయాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తట్టు నర్సింహులు, గుండప్ప, పెంటారెడ్డి, మచ్చెందర్, రాములు, జలీల్, విజయ్, కరుణ్రాజ్, వీరన్న, రమేశ్‌రెడ్డి, సరస్వతి, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.