దుబ్బాక,సెప్టెంబర్ 20: అభివృద్ధి, సంక్షేమమే కాకుండా అన్నిరంగా ల్లో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. పక్కనే ఉన్న ఆంధ్రాలో గెలిచిన మొదటి నెలలోనే అక్కడి సర్కారు రూ.4 వేల పింఛన్ ఇస్తే… ఇక్కడ గెలిచి పది నెలలు గడుస్తున్నా రూ.4 వేలు పింఛన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కారు తీరును ఆయన దుయ్యబట్టారు.
దుబ్బాకలో యువజన సంఘాల గణనాథ మండపాలను శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హరీశ్‌రావు దర్శించుకున్నారు. దుబ్బాకలో బీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్త్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కత్తి కార్తీక సొంత డబ్బులతో మా ఇంటి మహాలక్ష్మి కార్యక్రమాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. నిరుపేద గర్భిణులకు న్యూట్రీషియన్ కిట్ అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పేద గర్భిణుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ న్యూట్రీషిన్ కిట్ ప్రారంభించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని రద్దు చేసిందన్నారు. కేసీఆర్ కిట్‌ను రద్దు చేశారని ఆవేదన వ్యకం చేశారు. పేద ప్రజల పొట్టగొట్టి, సంక్షేమ పథకాలను రద్దు చేయడం బాధాకరమని అన్నారు. ఈ విషయంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు.
కేసీఆర్ కిట్‌ను పేరు మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ.. పేదలకిచ్చే సంక్షేమ పథకాలకు రద్దు చేయవద్దని రేవంత్ సర్కారుకు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు దేవుడెరుగు, ఉన్న పథకాలను లేకుండా చేస్తున్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ అని మరోసారి నిరూపించిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇచ్చే కల్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.
వానకాలం ముగుస్తున్నప్పటికీ రైతులకు రైతుభరోసా డబ్బులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందన్నారు. కాంగ్రెస్ మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని, అబద్ధ్దాల కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కరెంట్ సరఫరా సరిగ్గా లేక మోటర్లు కాలిపోతున్నాయని, రైతులను, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్పర్స న్ గన్నె వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.