మెదక్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): మాట తప్పడం రేవంత్ నైజమని, అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, ర్యాకల శేఖర్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం రేవంత్‌రెడ్డి మెదక్ వచ్చి ఒక్కటన్నా మెదక్‌కు పనికి వచ్చే మాట మాట్లాడిండా.. రేవంత్‌రెడ్డి నిలబడ్డ రాందాస్ చౌరస్తా కేసీఆర్ చేసిందేనని, మెదక్‌కు ఏం చేశాడో చెప్పడానికి ఇదే ఒక సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో రాందాస్ చౌరస్తా ఎలా ఉండే ఈరోజు ఎలా ఉందో చూడాలన్నారు. నువ్వు నామినేషన్ వేయడానికి వచ్చిన కలెక్టరేట్ ఎక్కడిది.. మెదక్ జిల్లా ఎవరూ చేశారు.. నువ్వు ర్యాలీలో చూస్తున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, ఫోర్‌లేన్ రోడ్లు, రాందాస్ చౌరస్తా, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, మంజోజిపల్లి బ్రిడ్జి కనబడలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఘనపూర్ ప్రాజెక్టుకు మహర్దశ వచ్చిందని తెలిపారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ రూ.100 కోట్లు ఇస్తే ఇచ్చిన నిధుల జీవోను రద్దు చేసి మెదక్‌కు అన్యా యం చేసింది రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. మెదక్‌లో యూనివర్సిటీలు, రైళ్లు వచ్చాయంటే అది కేసీఆర్ పుణ్యమేనన్నారు. ఇక్రిశాట్ ఇందిరాగాంధీ ఇచ్చారన్నారు. కానీ ఇక్రిశాట్ తెచ్చింది ఆ నాటి ప్రధానీ చరణ్‌సింగ్ అని గుర్తుచేశారు. బీహెచ్ఈఎల్ 1952 లో ప్రారంభిస్తే ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసింది 1980లో అన్నారు. ఏదీ పడితే అది అబద్ధాలు ఆడుతున్నాడు సీఎం రేవంత్, ఒక సీఎం మాట్లాడే మాటలేనా, ఇది పద్ధతి కాదు సంస్కారం కాదన్నారు.
కాంగ్రెస్ మంత్రులకు అహంకారం నెత్తికెక్కిందని, నేల మీదికి రావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పార్లమెంట్‌కు పోవాలని హరీశ్‌రావు తెలిపారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ మాట తప్పారన్నారు. హరీశ్‌రావు ఎత్తు గురించి నీకేం పని.. నా గురించి పక్కన పెట్టి రైతులు పడుతున్న తిప్పల గురించి ఆలోచించాలన్నారు. రైతులు చనిపోతే రైతు కుటుంబాన్ని సీఎం గానీ, మంత్రు లు కానీ ఇప్పటివరకు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. సీఎం రేవంత్ కేసీఆర్‌ను తిట్టుడే పనిగా పెట్టుకున్నాడు.. కేసీఆర్ తిట్టుకుంటూ ఎంతసేపు కాలక్షేపం చేస్తావని ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేకపోతే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెడతారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఎగవేత, దాటవేతలో పోటీ పడుతున్నారన్నారు.