సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30: సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభు త్వ పాఠశాల అంటే తనకెంతో ఇష్టమని, ఉపాధ్యాయులంటే ఇం కా ఇష్టమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇఫ్లూలో శిక్షణ పొందిన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ పాఠశాలను గొప్పగా తీర్చిదిద్ది రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చారన్నారు.
ఇక్కడి విద్యార్థులు ఇఫ్లూలో ఫారెన్ లాంగ్వేజీలు నేర్చుకొని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నట్లు తెలిపారు. నాట్కో వారు రూ.40 లక్షలు ఇస్తున్నారని, అవసరమైన పనులు చేసుకోవడంతోపాటు అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. పీఎం శ్రీ పథకం కింద ఈ పాఠశాల ఎంపికైందని, కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తాయని తెలిపారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులందరికీ ఐపాడ్ ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, సాయంత్రం విద్యార్థులందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని విద్యాసంస్థలను సిద్దిపేటకు తెచ్చామని, మెడికల్ కాలేజీకి అనుబంధంగా నాలుగు కళాశాలలు నడుస్తున్నాయని తెలిపారు. ఇందిరానగర్ పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులకు కూడా ఇఫ్లూ ద్వారా ఫారిన్ లాంగ్వేజీలు నేర్పించే ఏర్పాటు చేస్తా అన్నారు. స్పానిష్ భాష నేర్చుకుంటే విద్యార్థుల భవిష్యత్ గొప్పగా ఉంటుందని, అనేక దేశాల్లో స్పానిష్ భాష మాట్లాడుతారని తెలిపారు. గొప్పగా బోధించడతోనే ఈ పాఠశాలలో అడ్మిషన్ల కోసం 1000 మంది దరఖాస్తు చేసుకోవడం గొప్ప విషయమని హరీశ్‌రావు పేర్కొన్నారు.