సిద్దిపేట, జనవరి 24: యాసంగి సీజన్‌కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా సాగు, తాగునీటికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మాణం చేపట్టారని లేఖలో పేరొన్నారు.
ఈ రిజర్వాయర్ల ద్వారా వరుసగా ఆరు సంవత్సరాలు జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు అందించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ఈ నాలుగు రిజర్వాయర్ల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగా మ, సిరిసిల్ల జిల్లాలకు సాగు, తాగునీరు అందించామని లేఖలో పేర్కొన్నారు. గతేడాది యాసంగి సాగుకు కాళేశ్వరం జలాలతో నాలుగు రిజర్వాయర్ల ద్వారా ప్రత్యేక్షంగా, పరోక్షంగా కలిపి మూడు లక్షల ఎకరాల్లో పంట పండిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా రైతులకు యథావిధిగా సాగు నీరు అందించడానికి నీటి ప్రణాళిక కమిటీని ఆదేశించాలని లేఖలో మంత్రి ఉత్తమ్‌ను హరీశ్‌రావు కోరారు.
ఇప్పటికే యాసంగికి రైతులు నాట్లు వేసుకొని నీళ్లకోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం తరపున నీటి విడుదలకు భరోసా ఇవ్వాలని కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాల్వ ల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందించాలని, గతంలో మాదిరిగా ఈ రిజర్వాయర్ల ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, నీటిని విడుదల చేసి భూగర్భజలాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ప్రభుత్వం తరపున ఉమ్మడి జిల్లా రైతులకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని రైతుల పక్షాన హరీశ్‌రావు లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.